దారుణంః శోభనం గదిలోకి వెళ్లిన పెళ్లికొడుకు..

Tue Jun 22 2021 16:00:02 GMT+0530 (IST)

Shocking incident in Telangana

ధూమ్ ధామ్ గా పెళ్లి జరిగింది. విందులు వినోదాలు కూడా అయ్యాయి. ఇక ఆ రోజే కొత్త జంటకు శోభనం. సంతోషంగా నవ దంపతులను గదిలోకి తోలారు. లోపల ఏం జరిగిందో తెలియదు. తెల్లవారు జామున గదిలోంచి పరిగెత్తుకెళ్లిన నవ వధువు.. ‘ఆయన కనిపించట్లేదు’ అని పెళ్లికొడుకు తల్లిదండ్రులకు చెప్పింది.ఆందోళనతో వాళ్లంతా వచ్చి చూడగా.. గదిలో కనిపించలేదు. ఇళ్లంతా వెతకగా.. పక్క గదిలో ఉరికొయ్యకు వేళాడుతూ కనిపించాడు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఏం జరిగిందో తెలియక ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో అర్థంకాక గుండెలు బాదుకున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్లు కూడా వచ్చేశారు.

ఆ తర్వాత పుస్తెల తాడుతోపాటు కాలి మెట్టెలు పెళ్లిచీర అన్నీ అక్కడే వదిలేసి పెళ్లి కూతురిని తీసుకొని వెళ్లిపోయారు. దీంతో.. వరుడి కుటుంబ సభ్యులు సందేహం వ్యక్తం చేశారు. రాత్రి గదిలో ఏదో జరిగి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సంకాపురంలో చోటు చేసుకుంది. కొడుకును ఓ ఇంటి వాడిని చేసిన ఆనందం కొన్ని గంటలైనా నిలవకుండానే.. శాశ్వతంగా కడుపుకోత మిగులుస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేకుండా పోయింది.