హైదరాబాద్ లో అమానుషం.. ప్రియుడి మోజులో కొడుకును కొట్టి చంపింది

Wed Jun 09 2021 09:00:24 GMT+0530 (IST)

Shocking incident in Telangana

మారిన కాలంతో పాటు మారనిది ఏమైనా ఉందంటే అది అమ్మతనమే అన్న మాటకు కూడా అవకాశం ఇవ్వని ఈ తరహా ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. కనురెప్పగా మారి.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకును.. ప్రియుడి మోజులో పడి కొట్టి చంపేసిన దుర్మార్గం తాజాగా హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటు చేసుకుంది.మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలోని జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం జగద్గిరిగుట్టకు చెందిన సురేశ్ తో ఉదయ అనే మహిళకు పెళ్లైంది. వీరికి ఉమేశ్ అనే కొడుకు ఉన్నాడు.భాస్కర్.. ఉదయలు ఇద్దరు భాస్కర్ అనే మేస్తి వద్దకు పనికి వెళ్లేవారు. ఉదయతో పరిచయం పెంచుకున్న భాస్కర్.. అది కాస్తాసాన్నిహిత్యంగా మారింది. దీంతో భర్త ఆమెను హెచ్చరించేవాడు.

భార్యభర్తల మధ్య మనస్పర్దలు రావటంతో కొడుకును తీసుకొని రెండేళ్ల క్రితం బయటకు వెళ్లిపోయింది ఉదయ. జీడిమెట్లలోని భగత్ సింగ్ నగర్ లో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. కొడుకును చూసుకోవటానికి సురేశ్ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఉదయకు ఇది నచ్చేది కాదు.దీంతో.. ఏదో కారణంతో కొడుకును కొడుతూ ఉండేది. తాజాగా అన్నం తినలేదన్న పేరుతో మూడేళ్ల పిల్లాడ్ని వైరుతో కొట్టిన కారణంగా స్పృహ కోల్పోయాడు.

ఆసుపత్రికి తీసుకెళ్లిన వారు.. పిల్లాడికి ఉన్న దెబ్బల గురించి అడగ్గా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఉదయను ప్రశ్నిస్తే.. పిల్లాడు అన్నం పెడితే తినటం లేదని.. మొండికేస్తే కొట్టానని చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా..భాస్కర్ తో ఆమెకున్న వివాహేతర సంబంధం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే.. తామిద్దరం కలిసి కొట్టామని ఒప్పుకున్నారు. దెబ్బలకు తాళ లేక పసిప్రాణం పోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అమ్మతనానికి చేటు చేసిన ఈ వైనం స్థానికంగా సంచలనంగా మారింది.