Begin typing your search above and press return to search.

భార్యపై అనుమానం..బాత్రూంలోకి వెళ్లి బయటకి రాగానే గొడ్డలితో నరికి..!

By:  Tupaki Desk   |   24 Feb 2021 12:30 AM GMT
భార్యపై అనుమానం..బాత్రూంలోకి వెళ్లి బయటకి రాగానే గొడ్డలితో నరికి..!
X
పెద్దల సమక్షంలో , వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్లు వేసిన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను గొడ్డలి తో కిరాతకంగా హత్య చేసాడు. అనుమానం పెను భూతమై ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రతిరోజూ కూడా ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియుడి సాయంతో భర్తను భార్య కడతేర్చడమో, ప్రేయసి మోజులో పడి భర్తే భార్యను చంపేయడమో జరుగుతున్నాయి. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానపడి వారిని కడతేర్చిన భర్తలు కూడా ఉన్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని బాత్రూంలో ఉన్న భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత తెల్లారే వరకు బాత్రూం ముందే కూర్చున్నాడు. తెల్లారిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.

జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ... జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల శంకరయ్య ముంబాయిలోని కల్లు దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకి భార్య సుజాత, 12 ఏళ్ల వయసులోపు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లీకొడుకులు చర్లపల్లిలోనే సొంత ఇంట్లో ఉంటుండగా, భర్త శంకరయ్య మాత్రం ముంబాయిలో ఉండేవాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అయితే తాను వేరే ప్రాంతంలో ఉండటంతో భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం శంకరయ్యలో మొదలయింది. అప్పుడప్పుడు ఫోన్లోనూ, ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో గొడవపడేవాడు. ఆమెను కొట్టేవాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఈ రెండు నెలల్లో కూడా ప్రతీరోజూ ఆమెతో ఏదో ఒక కారణంతో గొడపడేవాడు.

రోజురోజుకు శంకరయ్యలో అనుమానం మరింత బలపడిపోయి ఆమెను చంపాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. సోమవారం తెల్లవారుజామున భార్య సుజాత బాత్రూంలోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన శంకరయ్య బాత్రూంలోకి వెళ్లి గొడ్డలితో విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తెల్లారే వరకు శంకరయ్య బాత్రూం గుమ్మం వద్దే కూర్చుండిపోయాడు. తెల్లవారిన తర్వాత ఈ ఘటనను చూసిన పిల్లలు, స్థానికులు హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి సోదరుడు ఈ ఘటనపై కేసు పెట్టాడు. దీనితో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.