దేశ రాజధానిలో దారుణం.. రోడ్డు మీద నడుస్తున్నమహిళకు కత్తిపోట్లు

Mon Mar 01 2021 12:00:01 GMT+0530 (IST)

Shocking incident in New Delhi

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళలో తన మెడలోని గొలుసును దొంగలించేందుకు ప్రయత్నించిన దుండగుడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి.. పోరాడిన మహిళ ఒకరు మరణించిన వైనం అయ్యో అనేలా చేస్తుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ కు చెందిన పాతికేళ్ల సిమ్రాన్ కౌర్.. తల్లి.. తన రెండేళ్ల కుమార్తెతోకలిసి రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు.వారికి పక్కగా నడుస్తున్న దుండగుడు ఒకడు.. హటాత్తుగా ఆమె మెడలోని చెయిన్ ను లాగబోయాడు. దీంతో అలెర్టు అయిన ఆమె.. ఒక్కసారిగా విరుచుకుపడింది. తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో దుండగుడు కిందకు పడిపోయాడు. అనంతరం లేచి.. తన దగ్గరున్న కత్తితోసదరు మహిళ పొట్టలో పొడిచి పరారయ్యాడు.

ఈ ఘటన జరుగుతున్న చోట టూవీలర్ మీద మరొకడు సిద్ధంగా ఉండటంతో వారు పారిపోయారు. కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడిన సిమ్రాన్ ను ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. ఈ దారుణ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.