కరీంనగర్‌లో వైద్యుల నిర్వాకం.. ఓ మహిళకు చేయాల్సిన ఆపరేషన్ మరొకరి.. ఆ తర్వాత..

Tue Jun 22 2021 18:00:01 GMT+0530 (IST)

Shocking incident in Karim Nagar

వైద్యుల తప్పులకు ప్రజలు బలి అవుతున్నారు. 24 గంటల కిందటే.. ఓ మహిళ గర్భిణి అని చెప్పి.. ఆపరేషన్ చేసి చూడగా.. ఆమె కడుపులో పెద్ద కణితి ఉన్నట్టు తేలింది. దీనికి వైద్యులదే తప్పని.. గడిచిన ఆరు మాసాలుగా వైద్యుల సంరక్షణలోనే తమకుమార్తె ఉందని.. అప్పట్లో గర్భిణి అని చెప్పారని.. కానీ..ఇప్పుడు కణితి ఉందని తేల్చారని.. ఆమె తల్లిదండ్రులు గగ్గోలు పెట్టిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో నిర్వాకం వెలుగు చూసింది. ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయాల్సింది ఒక మహిళకయితే పొట్టకోసింది మరో మహిళకు.. కావడంతో వైద్యుల వ్యవహారం మరోసారి వివాదంగా మారింది.కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విమర్శల పాలైంది. వైద్యుల నిర్లక్ష్యాన్ని మరోసారి కళ్లకు కట్టిన ఈ విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన మాలతి నరోత్తమరెడ్డి దంపతులు. మాలతి ఏడు నెలల గర్భవతి. నీరసంగా ఉండటం కడుపునొప్పి రావడంతో గురువారం కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. శుక్రవారం స్కానింగ్ చేశారు. గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని గుర్తించారు.

అందులో ఒక శిశువు బతికే అవకాశం లేదని ఇంకొక శిశువును కాపాడేందుకు సోమవారం గర్భసంచికి కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం మాలతిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడున్న డాక్టర్ వేరొకరి కేస్‌షీట్ చదివి మాలతి పొట్ట కోశారు. మాలతి గట్టిగా అరిచి వివరాలు చెప్పడంతో చీరిన పొట్టకు కుట్లు వేసి పంపించారు. మాలతి అప్రమత్తంగా లేకపోతే తల్లీబిడ్డలకు ప్రమాదం జరిగేదని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మాలతి భర్త నరోత్తమరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వచ్చిందని విచారణ చేస్తామని ఆర్‌ఎంఓ శౌరయ్య తెలిపారు. వాస్తవానికి పక్కబెడ్ పై ఉన్న మరో మహిళకు చేయాల్సిన ఆపరేషన్‌ను మాలతికి చేసేందుకు ప్రయత్నించడంతో వివాదం రేగింది. మరి దీనిపై వైద్య సంఘాలు ఏం చెబుతాయో చూడాలి.