Begin typing your search above and press return to search.

తెలుగు సీరియల్ లోనూ ఇన్ని ట్విస్టులు ఉండవేమో? కన్నకూతురే కోడలిగా!

By:  Tupaki Desk   |   7 April 2021 12:30 PM GMT
తెలుగు సీరియల్ లోనూ ఇన్ని ట్విస్టులు ఉండవేమో? కన్నకూతురే కోడలిగా!
X
తెలుగు టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని.. ఆ మాటకు వస్తే.. ఇన్ని ట్విస్టులు మరే సీరియల్లో కూడా ఉండవేమో? అలాంటి రియల్ ఉదంతం చైనాలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన పెళ్లి అందరిని ఆకర్షించటమే కాదు.. వైరల్ గా మారుతోంది. ఈ పెళ్లి గురించి తెలిసిన వారంతా ఇట్టే కనెక్టు అయిపోవటమే కాదు.. ఇంత డ్రామా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి. కోడలుగా తన ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నది చిన్నప్పుడు తప్పిపోయిన తన కుమార్తె అన్న విషయం తెలిసిన ఆ తల్లి ఆనందం ఒకవైపు.. మరోవైపు ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. అయితే.. ఈ ఉదంతంలో.. అనుకోని ట్విస్టుతో చివర్లో శుభం కార్డు పడటం విశేషంగా చెప్పాలి.

ఇంతకూ జరిగిందేమంటే.. చైనాలోని జియాంగ్జూ ప్రావిన్సులోని సుజో ప్రాంతంలో మార్చి 31న ఒక పెళ్లి జరిగింది. దీనికి పెద్ద ఎత్తున బంధువులు.. స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి వేళలో కాబోయే కోడలి చేతి మీద ఒక పుట్టుమచ్చను గుర్తించిన అత్తగారు.. పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల్ని.. ‘ఈ అమ్మాయి మీకు పుట్టినదా? లేదంటే.. పెంచుకుంటున్నారా?’’ అని అడిగేసింది. ఊహించని ఈ ప్రశ్నకు షాక్ కు గురయ్యారు పెండ్లి కూతురు తల్లిదండ్రులు.

ఎందుకంటే.. వారు ఏ విషయాన్ని అయితే ఎవరికి చెప్పకుండా రహస్యంగా దాచుకున్నారో..అదే విషయాన్ని వియ్యపురాలు అంత సూటిగా అడిగేసరికి షాక్ తిన్నారు. తేరుకొని.. ఆ అమ్మాయి తమకు పుట్టలేదని.. బజార్లో దొరికితే తమ సొంత కుమార్తెలా పెంచామని చెప్పారు. అప్పటివరకు తన తల్లిదండ్రులనుకున్న వారు కాదని తెలిసేసరికి పెండికుమార్తె తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె నోట మాట రాని పరిస్థితి. పెండ్లికి హాజరైన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే.. పెండ్లి కుమార్తె ఎవరో కాదని.. తన కన్న కూతురని.. చిన్నప్పుడు తప్పిపోయినట్లుగా పెండ్లికుమారుడి తల్లి చెప్పటంతో మిగిలిన వారంతా షాక్ తినే పరిస్థితి. అంటే.. అన్నాచెల్లెళ్ల పెళ్లి అన్న మాట. ఈ పరిస్థితికి ఎలా రియాక్టు కావాలో అర్థం కాని పరిస్థితి అక్కడి వారలో చోటు చేసుకుంది. అయితే.. ఈ పెళ్లికి తాను ఒప్పుకుంటున్నట్లుగా చెప్పి పెండ్లి కుమారుడి తల్లి మరో షాకిచ్చారు.

ఇంతకూ అసలు ట్విస్టు ఏమంటే.. తమ కుమార్తె చిన్నప్పుడు తప్పిపోవటం.. ఆ తర్వాత ఎంత వెతికినా దొరక్కపోవటంతో.. తాము ఒక మగ పిల్లాడ్ని పెంచుకున్నామని.. తోడబుట్టిన వాడు కాకపోవటంతో ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేయటంతో ఈ పెళ్లికి శుభం కార్డు పడినట్లైంది. బోలెడన్ని ట్విస్టులతో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.