Begin typing your search above and press return to search.

విశాఖలో అనూహ్యం.. బట్టలు తేవటానికి మేడ మీదకు వెళితే మీద పిడుగు పడింది

By:  Tupaki Desk   |   9 Jun 2021 2:32 AM GMT
విశాఖలో అనూహ్యం.. బట్టలు తేవటానికి మేడ మీదకు వెళితే మీద పిడుగు పడింది
X
ఊహించటానికి కూడా వీల్లేని ఉదంతం విశాఖపట్నంలోని పెందుర్తి సమీపంలో చోటు చేసుకుంది. ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి.. వర్షపు జల్లులు పడుతున్న వేళ.. ఆరేసిన బట్టలు తడిచిపోతాయన్న తొందర ఆరేళ్ల కొడుకు ప్రాణాలు పోవటానికి కారణమైంది. అదే సమయంలో.. తల్లి కూడా తీవ్రమైన గాయాలతో పోరాడుతోంది. మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకోవటానికి వెళ్లిన వారిపై పిడుగు పడిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ప్రవీణ్ పావని దంపతులు గాజువాకలో ఉంటారు. వీరికి ఆరేళ్ల రోహిత్ ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం పెందుర్తిలోని పుట్టింటికి కొడుకుతో పాటు వెళ్లింది. మంగళవారం సాయంత్రం వర్షం పడుతున్న వేళ.. మేడ మీద ఆర బెట్టిన దుస్తుల్ని కిందకు తీసుకెళ్లేందుకు వెళ్లింది. ఆమెతో పాటు.. కొడుకు కూడా వచ్చాడు. బట్టలు తీసుకుంటున్న వేళలోనే భారీగా ఉరిమిన ఉరుముతో.. పిడుగు పిల్లాడి మీద పడింది. దీంతో.. ఆ పిల్లాడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

ఈ ఘటనలో పావని తీవ్ర గాయాలకు గురైంది. పిడుగు పడిన శబ్దానికి హడలిపోయిన కుటుంబ సభ్యులు.. పడింది తమ ఇంట్లోని వారి మీదనేనని తెలుసుకొని వణికారు. మేడ మీదకు వెళ్లి.. తీవ్ర గాయాల పాలైన పావనిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అమ్మమ్మ ఇంటికి సరదాగా గడపటానికి వచ్చిన మనమడి అకాల మరణంతో వారు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ విషాద ఉదంతం అక్కడి వారినే కాదు.. విన్నవారందరిని అయ్యో అనుకునేలా చేస్తోంది.