Begin typing your search above and press return to search.

పింక్ డైమండ్ వ్యవహారం పై పరువు నష్టం దావా వెనక్కి..100 కోట్లు నష్టపోయిన టీటీడీ

By:  Tupaki Desk   |   25 Oct 2020 7:50 AM GMT
పింక్ డైమండ్ వ్యవహారం పై పరువు నష్టం దావా వెనక్కి..100 కోట్లు నష్టపోయిన టీటీడీ
X
తిరుమల శ్రీవారి ఆలయంలో పింక్ డైమండ్ మాయమై పోయిందని రెండేళ్ల కిందట మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశం పై వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అప్పటి సీఎం చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీడీపీ ప్రభుత్వం పింక్ డైమండ్ మాయమైపోయిందని ఆరోపణలు చేసిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి పై ఒక్కొక్కరిపై రూ. 100 కోట్ల చొప్పున రూ. 200 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. దీని కోసం ప్రభుత్వం కోర్టుకు రూ.రెండు కోట్ల మేర డిపాజిట్ కూడా చెల్లించింది. ఇది జరిగిన ఏడాదికి రాష్ట్రంలో ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో టీటీడీ కి కూడా నూతన పాలకమండలి ఏర్పాటయింది. నూతన పాలక మండలి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులును ఆగమ సలహాదారుగా నియమించింది. ఇదిలా ఉండగా పింక్ డైమండ్ మాయంపై దాఖలైన పరువునష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతిలోని పదో అదనపు జిల్లా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు అప్పట్లో కోర్టుకు డిపాజిట్ చేసిన రూ. రెండు కోట్లను కూడా వదులుకుంటామని తెలియజేశారు. దీనిపై వివిధ పార్టీల నాయకులు విమర్శలు వ్యక్తం చేశారు. కోర్టుకు చెల్లించిన రూ రెండు కోట్లను పాలకమండలి సభ్యులు నుంచి వసూలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ఫిబ్రవరిలో సమావేశమైన టీటీడీ పాలకమండలి పింక్ డైమండ్ వ్యవహారంలో కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసింది. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా పై రమణ దీక్షితులు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేయగా, టీటీడీ ప్రతిష్టకు తామెప్పుడూ భంగం కలిగించేలా ప్రవర్తించలేదని వారిద్దరూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని ఆ తీర్మానం లో పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ వివరణకు సంతృప్తి చెందడం తోనే పరువు నష్టం దావా కేసులో ఉపసంహరించుకుంటున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.