Begin typing your search above and press return to search.

అమెరికాలో మనోడ్ని అన్ని మాటలు అనేసి.. దాడి చేశారు

By:  Tupaki Desk   |   14 Jan 2022 4:30 AM GMT
అమెరికాలో మనోడ్ని అన్ని మాటలు అనేసి.. దాడి చేశారు
X
దేశం ఏదైనా అందరిని సమానంగా చూసే పెద్ద మనసు చాలా ముఖ్యం. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలోని తెల్లోళ్ల కురచబుద్ధి అంతా ఇంతా కాదు. విచిత్రమైన విషయం ఏమంటే.. అమెరికాలో ఉండేవారంతా వలసలే. అక్కడ ఉండే తెల్లోళ్లు సైతం.. ఏదో ఒక టైంలో వేరే ప్రాంతం నుంచి.. వేరే దేశం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినోళ్లే తప్పించి.. సొంత దేశస్తులు అనేటోళ్లే లేరు. ఆ మాటకు వస్తే.. అమెరికా ఒక వలసల దేశం. అలాంటి ఆ దేశంలో.. తమ మూలాల్ని మరిచిపోయి.. అహంకారంతో కొట్టుకునేటోళ్లు లక్షల్లో ఉంటారు. అప్పుడప్పుడు తమ అహంకారాన్ని మాటల్లోనూ.. చేతల్లోనూ ప్రదర్శిస్తుంటారు.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటుచేసుకుంది. అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్ గా పని చేసే ఒక ప్రవాస భారతీయుడిపై జాత్యాంహకార దాడి జరిగింది. న్యూయార్కు మహానగరంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై పలువురు మండిపడుతున్నారు. మనోడిపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించిన సమాచారాన్ని అక్కడి మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఈ దాడి ఘటనపై ప్రవాస భారతీయులు మండిపడుతూ.. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

పంజాబ్ కు చెందిన ఒక యువ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవరర్ గా పని చేస్తున్నాడు. దాదాపు పది రోజుల క్రితం జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 4 వద్ద తన కారును పార్కు చేశాడు. ఇంతలో కస్టమర్ రావటంతో కారును ముందుకు కదిపే ప్రయత్నం చేయటం.. అక్కడ మరో కారు ఉండటంతో.. ముందుకు కదల్లేని పరిస్థితి. దీంతో.. కారు దిగిన ప్రవాస భారతీయుడు.. తన కారును ముందుకు వెళ్లేందుకు వీలుగా కారును పక్కన పెట్టాలని కోరాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి.. మనోడి ముఖం మీదా.. ఛాతీ మీద పంచ్ లు విసిరి గాయపర్చాడు.

ఓవైపు దాడికి పాల్పడుతూనే.. మరోవైపు సదరు పంజాబీ ధరించిన తలపాగాను తీసే ప్రయత్నం చేశాడు. ‘ టర్బనేడ్‌ పీపుల్‌, గో బ్యాక్‌ టూ యువర్‌ కంట్రీ ’ అంటూ జాత్యాంహార వ్యాఖ్యలకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పోర్టు అథారిటీ పోలీస్ డిపార్ట్ మెంట్ కు కంప్లైట్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరన్న విషయం ఇంకా తేలలేదు. ఈ ఘటనపై భారతీయ సంఘాలు స్పందించి.. మనోడికి అండగా నిలుస్తూ.. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.