Begin typing your search above and press return to search.

11 పుర్రెలు.. 54 ఎముక‌లు.. అన్నీ చిన్నారులవే.. భ‌యంక‌ర వాస్త‌వం వెలుగులోకి!

By:  Tupaki Desk   |   15 Jan 2022 12:30 AM GMT
11 పుర్రెలు.. 54 ఎముక‌లు.. అన్నీ చిన్నారులవే.. భ‌యంక‌ర వాస్త‌వం వెలుగులోకి!
X
అబార్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా కేంద్రం చేసిన చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్క‌డం... ఇలా అబార్ష‌న్ల ద్వారా క‌న్నుకూడా తెర‌వ‌ని స్థితిలో ఉన్న శిశువుల‌ను అదే ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లోనే పూడ్చిపెట్ట‌డం.. ఇదీ.. మ‌హారాష్ట్ర‌లోని ఓ ఆసుప‌త్రి ఘ‌న కార్యం. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు 11 పుర్రెలు, 54 ఎముక‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ ప‌సిగుడ్డుల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఒక కేసు విష‌యంలో మొద‌లైన ప‌రిశోధ‌న‌లో ఈ దిగ్భ్రాంతిక‌ర వాస్త‌వాలు వెలుగు చూశాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేస్తోన్న దారుణాలు బయటపడ్డాయి. ఆస్పత్రి ఆవరణలో పిండాల ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి.

ఏం జ‌రిగిందంటే..

మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఓ 13 ఏళ్ల బాలికను బలవంతంగా గర్భస్రావం చేయించుకోవాలని ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్న మైనర్‌ బాలుడి తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అబార్షన్ చేయడానికి ఓ ఆస్పత్రి వైద్యులకు డబ్బులు కూడా ఇచ్చారు. అయితే.. ఆ బాలిక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో అబార్ష‌న్ చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్న‌ ఆర్వీ తహసీల్‌లోని కదమ్ ఆసుపత్రి పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో వారికి ఆసుప‌త్రి చేస్తున్న దాష్టీకాలు దృష్టికి వ‌చ్చాయి.

ముఖ్యంగా ఆసుపత్రి ఆవరణలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ వ‌ద్ద 11 పుర్రెలు, 54 ఎముకలు బయటపడ్డాయి. ఇవ‌న్నీ ప‌సికందులవేన‌ని పోలీసులు తెలిపారు. అలాగే అక్కడ తడిచిన బట్టలు, బ్యాగులు, తవ్వడానికి ఉపయోగించే గడ్డపారలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆస్పత్రి డైరెక్టర్ రేఖా కదమ్, ఆమె సహచరులలో ఒకరిని అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి జనవరి 4న ఆర్‌వీ పోలీసులకు సమాచారం అందిందని మహిళా దర్యాప్తు అధికారుల బృందం అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వందనా సోనూనే, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న తెలిపారు. పిండాల ఎముకలను, పుర్రెలను పరీక్షలకు పంపించామని అవన్నీ చట్టప్రకారం చేసిన గర్భస్రావాలా.. కాదా అన్నది తెలుసుకుంటామని అన్నారు. అయితే అబార్షన్స్‌కు సంబంధించి వైద్యులు ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేదని చెప్పారు. కాగా బాధితురాలికి రక్షణ కల్పిస్తామని చెప్పారు.