మద్యం మత్తులో పొట్టేలు తల అనుకొని మనిషి తల నరికేశాడు

Mon Jan 17 2022 13:30:03 GMT+0530 (IST)

Shocking Incident In Madanapalle

పీకల దాకా తాగిన ఒకడి బాధత్యారాహిత్యం ఒక నిండు ప్రాణాన్ని తీసింది. ఈ దారుణ ఘటనకు చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వేదికైంది. పండగ నాడు గ్రామ దేవతకు పొట్టేలను బలి ఇచ్చే వేళ.. పొట్టేలు తల అనుకొని మనిషి తలను నరికేసిన దారుణ ఉదంతం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమ వేళ.. అర్థరాత్రి వేళ జరిగిన ఈ ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఆ గ్రామంలో కలకలాన్ని రేపటమే కాదు.. ఒక కుటుంబాన్ని వీధిన పడేలా చేసింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..మదనపల్లె మండలం వలసపల్లిలో సంక్రాంతి పండుగ రోజున గ్రామస్థులు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. కనుమ వేళ.. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇవ్వటం అలవాటుగా ఉంది. ఈ క్రమంలో పొట్టేలను తీసుకొచ్చి తలారి సురేశ్ కు దేవతకు బలి ఇచ్చే బాధ్యతను అప్పజెప్పారు. అతను.. చలపతిని బలి ఇవ్వాలని.. తాను పొట్టేలను పట్టుకుంటానని చెప్పాడు.

అప్పటికే చలపతి పూటుగా తాగేసి ఉన్నాడు. మత్తులో జోగుతున్నఅతను.. పొట్టేలును నరికే క్రమంలో.. పొట్టేలు తల అనుకొని సురేశ్ తలను నరికాడు. పదునైన ఆయుధంతో బలంగా నరకటం.. మెడపైన తీవ్ర గాయమైంది. ఊహించని పరిణామంతో గ్రామస్తులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే.. బాధితుడ్ని స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరణించిన సురేశ్ కు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడు చలపతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ తరలించారు. కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అప్పటివరకు సంక్రాంతి సంబంరంలో మత్తుగా ఊగుతున్న వారంతా ఇప్పుడు ఆవేదనలో మునిగిపోయారు. బాధితుడి కుటుంబ శోకాన్ని ఆపటం ఎవరి తరం కావట్లేదు.