పాము కాటేసింది.. ఆ తర్వాతేమైందో తెలిస్తే షాకే

Mon Jun 14 2021 12:00:44 GMT+0530 (IST)

Shocking And Funny Incident In Karnataka

పామును చూస్తేనే వణికిపోయేవారెందరో. అలాంటిది పెద్ద పాము కాటేసిన తర్వాత కూడా ధైర్యంగా ఉండటం.. తనను కాటేసిన పామును పట్టుకోవటం లాంటివి ఊహించగలమా? రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఇంతకూ ఈ విచిత్రమైన ఉదంతం ఎక్కడ చోటు చేసుకున్నదంటే..కర్ణాటకలోని బళ్లారి డివిజన్ లోని ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప అనే యువకుడు ఉన్నాడు. రోజు మాదిరే అతడు పొలం పనులకు వెళ్లాడు. అనుకోని రీతిలో పొలంలో పని చేస్తున్న కాడప్పను ఒక పాము కాటేసింది. అధైర్యం చెందని అతగాడు.. ఒక చేతితో తనను కాటేసిన పామును గట్టిగా పట్టుకున్నాడు. హుటాహుటిన తమ ఊరికి దగ్గర్లోని మెట్రి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.

అక్కడ డాక్టర్లు లేకపోవటంతో ఫ్రెండ్ సాయాన్ని తీసుకొని కంప్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడేమో.. పామును పట్టుకొని వీరావేశంగా వస్తున్న ఇతన్ని చూసిన వైద్యులు హడలిపోయారు. ముందు పామును బయటపడేసి లోపలకు రమ్మన్నారు. కానీ.. తనకు జరిగిందంతా చెప్పిన అతగాడి మాటలతో స్థిమితపడి ప్రథమ చికిత్స చేశాడు.

తనను కరిచిన పాము ఏ తరహాకు చెందిందన్న విషయాన్ని వైద్యులకు చెప్పే విషయంలో తాను ఏమైనా తప్పు చేస్తానా? అన్న ఉద్దేశంతో తనను కరిచిన పామును సజీవంగా పట్టుకొచ్చిన కాడప్ప ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఏమైనా.. ముప్పు తప్పినట్లేనని భావిస్తున్నారు.