Begin typing your search above and press return to search.

భారీ కరెంటు బిల్లు వచ్చిందన్నందుకు అధికారుల చెప్పిన సమాధానం తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   25 May 2020 1:30 PM GMT
భారీ కరెంటు బిల్లు వచ్చిందన్నందుకు అధికారుల చెప్పిన సమాధానం తెలిస్తే షాకే
X
చాలామందికి ఎదురయ్యే అనుభవమే ఇది. కాకుంటే.. ఆ ఇష్యూలో ఇప్పటివరకూ ఏ అధికారి స్పందించిన రీతిలో రియాక్ట్ అయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారటమేకాదు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లో ఒక విద్యుత్ వినియోగదారుడికి నెలవారీ బిల్లు ఏకంగా రూ.80వేలు వచ్చింది. దీంతో షాక్ తిన్న అతగాడు.. తనకు అంత బిల్లు వచ్చే అవకావమే లేదని.. తన బిల్లును చెక్ చేసి చెప్పాలంటూ ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు మాల్యా జిల్లాకుచెందిన హరీశ్ జాదవ్.

తాను చేసిన కంప్లైంట్ మీద అధికారుల స్పందన ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించిన అతగాడికి.. అధికారుల సమాధానం చూసి దిమ్మ తిరిగిపోయింది. ఆన్ లైన్ లో అతడి ఫిర్యాదును క్లోజ్ చేసినట్లుగా చూసుకొని తొలుత మురిసిపోయాడు. తనకు న్యాయం జరిగిందని భావించాడు. వెంటనే.. తన ఫిర్యాదువిషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది తెలుసుకునే ప్రయత్నం చేసి.. అవాక్కు అయ్యాడు.

ఎందుకంటే.. విద్యుత్ అధికారులు ఇచ్చిన సమాధానం అలా ఉంది మరి. కరెంటు బిల్లు తక్కువ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకో.. అంటూ బదులిచ్చిన వైనంతో నోట మాట రాలేదు. వెంటనే.. తన సమస్యను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఈ ఇష్యూ సోషల్ మీడియాలోనూ.. తర్వాత మీడియాలో రావటంతో విద్యుత్ ఉన్నతాధికారులు అలెర్టు అయ్యారు. బీజేపీ ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు.

అసలీ సమాధానాన్ని ఎవరిచ్చారని చెక్ చేయగా.. ఒక విద్యుత్ ఉద్యోగి ఇచ్చినట్లుగా గుర్తించారు తక్షణమే అతడ్ని విధుల నుంచి తప్పిస్తూ.. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లో ఇప్పుడు సంచలనంగా మారింది. లాక్ డౌన్ కు కాస్త ముందుగానే మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దించేసి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవటం తెలిసిందే.