హైదరాబాద్ లోని ఆ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు లెక్క తెలిస్తే షాకే

Tue Jul 07 2020 12:00:37 GMT+0530 (IST)

Shock if you know the current bill of the house in Hyderabad

అదో సింగిల్ బెడ్రూం ఇల్లు. అలా అని ఖరీదైన ప్రాంతంలో ఉన్నది కూడా కాదు. మరి.. అలాంటి సింగిల్ బెడ్రూం ఇంటికి ఎంత కాల్చినా వచ్చే నెల కరెంటు బిల్లు ఎంత ఉంటుంది? మీ ఆలోచనలకు పదును పెట్టండి. కరెంటు ఉద్యోగుల సిత్రాల్ని పరిగణలోకి తీసుకొని బిల్లు ఎంత వచ్చిందని చెప్పే ప్రయత్నం చేయండి. మీరెంత ఆలోచించినా కూడా.. మేం చెప్పే మొత్తాన్ని మాత్రం ఊహించి ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే.. కలలో కూడా ఊహించలేనంత కరెంటు బిల్లు ఇచ్చి.. దిమ్మ తిరిగే షాకిచ్చారు హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగులు.ఇంతకూ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. సికింద్రాబాద్ లోని లాలాపేట వద్ద జనప్రియ అపార్ట్ మెంట్ ఉంది. అందులోని సింగిల్ బెడ్రూంకు ఈనెల వచ్చిన కరెంటు బిల్లునుచూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే.. తాజాగా కరెంటు ఆఫీసు వారు చేతిలో పెట్టిన బిల్లు మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.2511467. ఇంత బిల్లును చూసి అవాక్కైన సదరు యజమాని.. తనకున్న అన్ని పనుల్ని వదిలేసి.. తార్నాక లోని కరెంటు ఆఫీసుకు పరుగు పరుగున వెళ్లాడు.

తనకిచ్చిన కరెంటు బిల్లును చూపించాడు. యజమాని వివరాలు తెలుసుకొని.. బిల్లును నిశితంగా గమనించిన కరెంటు ఉద్యోగులు.. అతగాడి సమస్యనుపరిష్కరిస్తామని హామీ ఇచ్చారట. కరెంటు మీటర్ లోని లోపం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. మార్చి ఆరు నుంచి జులై ఆరు మధ్యలో 345007 మీటర్లు తిరిగినట్లుగా గుర్తించారు. ఇదంతా విద్యుత్ మీటర్ లోని లోపం కారణంగా చోటు చేసుకొని ఉంటుందని.. ఆ లోపాన్ని సరిచేస్తూ.. కొత్త మీటరు వేశారు. రూ.2095 మొత్తాన్నిచెల్లించాలని లెక్క తేల్చారు.మొత్తానికి మీటర్ లోపం ఏమో కానీ.. బిల్లు చూసిన తర్వాత మాత్రం సదరు బాధితుడి గుండెల్లో పుట్టిన దడను తలుచుకున్నోళ్లందరికి చెమటలు పట్టటం ఖాయం.  రాబోయే రోజుల్లో మీకిలాంటి పరిస్థితే ఎదురైతే మాత్రం.. టెన్షన్ పడొద్దు.