Begin typing your search above and press return to search.

గాలి మ‌నిషికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి..క‌ర్నాట‌కంలో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   18 July 2019 1:39 PM GMT
గాలి మ‌నిషికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి..క‌ర్నాట‌కంలో కొత్త ట్విస్ట్‌
X
క‌ర్నాట‌క కుర్చీ రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతోంది. తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కాంగ్రెస్‌ - జేడీ(ఎస్‌) రెబల్‌ ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ లో ఇంకో అంకం తెర‌మీద‌కు వ‌చ్చింది. తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాలని ఒత్తిడి చేయరాదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్న కుమారస్వామి ప్రభుత్వానికి సంకట స్థితిని తెచ్చింది. రాజీనామా చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోతే ప్రభు త్వం మైనార్టీలో పడిపోయి విశ్వాస పరీక్షలో ఓడిపోయే ప్రమాదం నెలకొంది. అయితే, ఈ స‌మ‌యంలోనే, కాంగ్రెస్ గేమ్ ప్లే చేసింది. మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి మ‌నిషికి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసి...హైడ్రామాను మ‌రిన్ని మ‌లుపులు తింపింది.

క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం హెచ్‌ డీ కుమార‌స్వామి బ‌ల‌పరీక్ష కోసం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. స్పీక‌ర్ ర‌మేశ్ పాత్ర‌పైన కూడా కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నార‌ని సీఎం త‌న ప్ర‌సంగంలో ఆరోపించారు. య‌డ్డీ ఎందుకు ఇంత తొంద‌ర ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. విశ్వాస‌ప‌రీక్ష‌పై చ‌ర్చ ఒక్క రోజు మించ‌కుండా నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్ష నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప స‌భ‌లో తెలిపారు. రూల్ 164 ప్ర‌కార‌మే చ‌ర్చ జ‌రుగుతుంద‌ని స్పీక‌ర్ కేఆర్ ర‌మేశ్ కుమార్ చెప్పారు. రెబ‌ల్ ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ముందు ఆరోప‌ణ‌లు చేశార‌ని - వాటిని క్లారిఫై చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కుమార‌స్వామి చెప్పారు. చ‌ర్చ లేకుండా బ‌ల‌ప‌రీక్ష ఉండ‌ద‌ని సీఎం అన్నారు. రెబ‌ల్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఒక బీఎస్పీ ఎమ్మెల్యే ఇవాళ స‌భ‌కు రాలేదు. రెబ‌ల్ జ‌ట్టులో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు రాజ్యాంగ మూలాల‌ను ధ్వంసం చేస్తున్న‌ద‌ని కాంగ్రెస్ నేత - మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య అన్నారు. పార్టీ ఫిరాయింపు అవినీతి రాజ‌కీయాల‌కు తెర‌లేపుతుంద‌న్నారు. దీంతో స‌భ‌లో ఉన్న బీజేపీ స‌భ్యులు భారీ స్థాయిలో వ్య‌తిరేక నినాదాలు చేశారు.

కాగా, విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా సభలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్. తమతో జత కలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని శ్రీరాములుకు బహిరంగంగానే ఆఫర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య సభలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గాలి మ‌నిషి ప‌ద‌వి కోసం ప్లేట్ ఫిరాయిస్తారా? అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కాగా, అసెంబ్లీలో ఇవాళ్టి బలపరీక్షను వాయిదా వేయించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించడం.. వాటిని బీజేపీ అడ్డుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో గవర్నర్‌ వాజూభాయి కీలక ఆదేశాలిచ్చారు. ఇవాళ రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ ను ఆదేశించారు. బలపరీక్ష విషయమై బీజేపీ నేతలు గవర్నర్ వాజుభాయ్‌ ను కలిసి విజ్ఞప్తి చేయగా.. ఇవాళే బలపరీక్ష ముగించాలనంటూ ఆయన రాజ్‌ భవన్ నుంచి ఆదేశిస్తూ లేఖ పంపించారు. ఐతే.. ఈ వ్యవహరంలో గవర్నర్ ఆదేశాలివ్వడమేంటంటూ కాంగ్రెస్‌ సభ్యులు వాదిస్తున్నారు.