Begin typing your search above and press return to search.

పాతికేళ్ల కల తర్వాత ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి!

By:  Tupaki Desk   |   17 Nov 2019 12:49 PM GMT
పాతికేళ్ల కల తర్వాత ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి!
X
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని.. తమ బాలసాహెబ్ ను సీఎంను చేయాలని శివసేన పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సీఎం కుర్చీ తమకే కావాలన్న పట్టుదలతో ఇప్పటికి ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్న శివసేన పెద్ద.. పెద్ద మాటల్నే చెబుతోంది. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్డీయే సమావేశానికి తాము వెళ్లమని చెబుతున్నారు.

ఉద్దవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని శివసేన కోరుకుంటుందని సేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్సీపీ.. కాంగ్రెస్ తో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. శివసేన ప్రభుత్వానికి సారథ్యం వహిస్తుందని పేర్కొన్నారు.

తమ పార్టీకి చెందిన నేతనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారన్న ఆయన.. ఐదేళ్లు కాదు.. పాతికేళ్లు తమదే పాలన అంటూ స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తమ సారథ్యంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న రౌత్.. ఎన్సీపీ.. కాంగ్రెస్ తో కలిపి ఉమ్మడి ప్రణాళికపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

శివసేన నుంచే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అంటూ ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముందు కొత్త మిత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు మీద ఫోకస్ చేస్తే మంచిది. అది మానేసి.. పాతికేళ్లు తమదే ప్రభుత్వం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పటంతో ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మొన్నటి వరకూ బీజేపీతో దోస్తానా నడిపి.. ఇప్పుడు విడిపోయినట్లే.. శివసేనతో ఎన్సీపీ.. కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధంగా చెప్పలేం. రాజకీయాల్లో రేపు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఆ విషయాల్ని వదిలేసి.. వర్తమానం మీద మరింత ఫోకస్ పెడితే మంచిదంటున్నారు. ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తర్వాత ఈ తరహా మాటలు చెబితే బాగుంటుంది కానీ.. ఏమీ కాక ఏవేవో కలల్ని చెప్పటం కాస్త తగ్గిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.