శిల్పా చౌదరి క్రైం డేటా చూసి పోలీసులే షాక్

Mon Nov 29 2021 05:00:01 GMT+0530 (IST)

Shilpa Chaudhary shocked police over crime data

శిల్పా చౌదరి.. ఇప్పుడు ఈ కి‘లేడి’ సినీ అధికార ప్రముఖులను మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తీరు చూసి పోలీసులే షాక్ అవుతున్న పరిస్థితి నెలకొందట.. రోటీ మేకర్ పేరుతో లూటీలు రియల్ వ్యాపారం పేరుతో దగా.. కిట్టి పార్టీలతో దుబారా చేసి కోట్లు కొల్లగొట్టిన ఈ మాయలేడి అరెస్ట్ తర్వాత విచారణలో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి.శిల్పా చౌదరి.. ఇప్పుడీ పేరు మీడియాలో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా 200 కోట్ల వరకూ కుచ్చుటోపీ పెట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్ చేయడంతో ఈమె టాలీవుడ్ హీరోలను మోసం చేసిందని కథలు కథలుగా ప్రచారం సాగుతోంది.

సెలబ్రెటీల కార్యకలాపాలకు సంబంధించిన ఫేజ్3 వార్తలు ఫాలో అయ్యేవారికి శిల్పా చౌదరి పరిచితురాలే. టాలీవుడ్ హీరోలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పారిశ్రామికవేత్తలు లాయర్లతో ఈమె బాగా క్లోజ్ గా ఉండి శివారు ప్రాంతాల్లో తరచూ ఫేజ్ 3 పార్టీలు ఇస్తూ వారిని ఆకర్షించేదట..తాజాగా అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి టాలీవుడ్ హీరోలు బడాబాబుల దగ్గర ఈమె డబ్బులు లాగేసిందట..  ఈమె వలలో చిక్కిన వారిలో టాలీవుడ్ యువ హీరోలు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని టాక్.శిల్పా వడ్డీ వ్యాపారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసినట్టు సమాచారం. దీంతో ఈమె చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

శిల్పా చౌదరి క్రైం డేటాను పోలీసులు వెలికితీస్తున్నారు. ఇందులో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కిట్టి పార్టీలతో దుబారా రియల్ వ్యాపారం బౌన్సర్లతో బెదిరింపులు ఇలా శిల్పా క్రైమ్ ఎపిసోడ్స్ ఖాకీలను షాక్ కు గురిచేస్తున్నాయి.

గండిపేట్ లో 70 కోట్ల రూపాయలతో లగ్జరీ విల్లాను శిల్పా చౌదరి కొనుగోలు చేసింది. ప్రముఖులను వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించి కొల్లగొట్టిన మొత్తంతో ఈ విల్లా కొన్నదని తేలింది.

నార్సింగిలో నాలుగు జూబ్లిహిల్స్ బంజారాహిల్స్ మాదాపూర్ పీఎస్ లలో మొత్తం కలిపి శిల్పపై 8 కేసులు నమోదయ్యాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.  ప్రాథమికంగా 90 కోట్లకుపైగా శిల్పా దంపతులు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరింత లోతుగా విచారిస్తే వసూళ్ల పర్వం అంతకుమించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.