అందరినీ ఆశ్చర్యపరచిన షర్మిల

Mon Sep 13 2021 11:28:50 GMT+0530 (IST)

Sharmila surprised everyone

తెలంగాణలో ఉనికి కోసం నానా అవస్థలు పడుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. తొందరలోనే జరగబోతున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీలోకి దిగేది లేదని గతంలో ప్రకటించిన షర్మిల రెండేళ్ళ తర్వాత జరగబోయే అసెంబ్లీకి మాత్రం ఇపుడే అభ్యర్ధిని ప్రకటించేశారు. తిరుమలగిరి లో జరిగిన రోడ్ షో లో మాట్లాడిన వైఎస్ షర్మిల తుంగతుర్తి అభ్యర్ధిగా ఏపూరి సోమన్నను ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.పార్టీ ఉనికి చాటుకోవటానికి షర్మిల నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్షలని ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తు కాస్త హడావుడి చేస్తున్నారు. పార్టీలో షర్మిల తప్ప చెప్పుకోతగ్గ రెండో నేత లేరు. చేరిన కొద్ది మంది నేతలు కూడా మళ్ళీ పార్టీని వదిలేస్తున్నారు. ఈమధ్యనే ఇందిరా శోభన్ పార్టీ అధికార ప్రతినిధిగా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్న నలుగురు బయటకు వెళ్ళిపోవటమే కానీ కొత్తగా చేరే వాళ్ళు కనబడటం లేదు.

ఇపుడు షర్మిల ప్రకటించిన తుంగతుర్తి అభ్యర్థి ఏపూరి సోమన్న కూడా తొందరలోనే పార్టీని వదిలేస్తారే ప్రచారం జరుగుతోంది. 2023లో జరగబోయే షెడ్యూల్ ఎన్నికలకు ఇఫ్పుడే అభ్యర్ధిని ప్రకటించటమంటే విడ్డూరమనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో రేపేమవుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది రెండేళ్ళ తర్వాత రాబోయే ఎన్నికలకు ఇఫుడే అభ్యర్థిని ప్రకటించటంలో అర్ధమేలేదు. ఈ విషయం తెలిసినా షర్మిల సోమన్నను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారో అర్థం కావటం లేదు.

రాబోయే ఎన్నికల విషయంపైనే షర్మిల ఇంతగా దృష్టి పెట్టినప్పుడు మరి తొందరలోనే జరగబోయే హుజూరాబాద్ లో మాత్రం పార్టీ తరపున ఎందుకు అభ్యర్థిని దింపటం లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఉంటుంది. పైగా పార్టీ నుండి పోటీ చేయటం లేదని చెప్పిన షర్మిల 100 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని ప్రకటించారు. హుజూరాబాద్ లో పోటీ చేసే నిరుద్యోగులకు అండగా ఉంటామని చేసిన ప్రకటన కూడా విచిత్రమే. మొత్తం మీద షర్మిల పార్టీ ఓ దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తోందనే విషయం అందరికీ అర్ధమవుతోంది.