Begin typing your search above and press return to search.

షర్మిల దీక్ష: ఒక ఫ్లాప్ షోనా?

By:  Tupaki Desk   |   19 April 2021 12:30 AM GMT
షర్మిల దీక్ష: ఒక ఫ్లాప్ షోనా?
X
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ఆర్ కుమార్తె వై.ఎస్. షర్మిల తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని షర్మిలా శపథం చేశారు. నిరుద్యోగ యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని రెండేళ్లపాటు ఓపికపట్టాలని ఆమె ఉపదేశించారు. ఆ సమయానికి తన పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని షర్మిల వ్యక్తం చేయడం విశేషం. రాజన్న బిడ్డనని.. ఆడిన మాట తప్పనని.. తెలంగాణలో నిరుద్యోగాన్ని తొలగించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నట్టు సభా ముఖంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ ను ఒక ఎద్దుతో పోల్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఆమె డిమాండ్‌పై స్పందించడం లేదని విమర్శించారు. కేసిఆర్ తన డిమాండ్‌కు తగ్గట్టుగా నోటిఫికేషన్లు వేసే వరకు ఈ సమస్యను లేవనెత్తుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల దీక్ష ముగిసిన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, నోటిఫికేషన్ల జారీకి ఆలస్యం చేసినందుకు పరిహారంగా ఉద్యోగార్ధులకు వయోపరిమితిని 7 సంవత్సరాలు సడలించాలని ఆమె డిమాండ్ చేశారు.

షర్మిల డిమాండ్లు బలంగా.. స్పష్టంగా ఉన్నప్పటికీ ఒక్క విషయంలోనే ఆమె ఫెయిల్ అయ్యారు. దీక్షను 3 రోజులు ఎంచుకోవడం.. నిరసనకు తక్కువ సమయాన్ని ఎంచుకోవడంతో ప్రజల నుంచి స్పందన తక్కువగా వచ్చిందంటున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఇప్పటికే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. మీడియా దానిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. దీంతో షర్మిలకు కవరేజ్ చాలా తక్కువగా వచ్చింది. షర్మిల నిరసన ఈ టైంలో చేయడం తప్పు అని.. ఇది సమయం సందర్భం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కోవిడ్ -19 రెండో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ కారణాల వల్ల షర్మిల దీక్షకు రాజకీయ మైలేజ్ రాలేదు.

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. పోలీసులు ఆమెకు 3 రోజుల దీక్షకు అనుమతి ఇవ్వలేదు. తరువాత నిరసన వేదికను ఇందిరా పార్క్ నుంచి ఆమె లోటస్ పాండ్ నివాసానికి మార్చింది. బహిరంగ ప్రదేశంలో నిరసన జరిపితే మైలేజ్ వచ్చేది.కానీ ఇప్పుడు సొంత నివాసంతో పోలిస్తే భిన్నమైన ప్రభావాన్ని చూపుతుందంటున్నారు.

పై కారణాలతో పాటు తెలంగాణ ప్రజలు షర్మిలను సీమాంధ్ర వ్యక్తిగా చూస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆమె కేసిఆర్‌ను వ్యతిరేకిస్తూ, ఆయన విధానాలను తప్పుపడుతున్నారు. ఇందిరా పార్క్‌లో ఆమె చేసిన నిరసనకు కూడా పెద్దగా స్పందన రాలేదు.

షర్మిల ప్రమాణాలు.. ప్రకటనలు ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు. ఆమె ఒక పార్టీని పెట్టి.. పార్టీ విధివిధానాలు, ఎజెండాను ప్రకటించినట్లయితే మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. చివరగా షర్మిలా దీక్ష ఫ్లాప్ షోలా మారిందంటున్నారు.