బాబాయ్ హత్య కేసులో త్వరలో నిజాలు బయటకు వస్తాయి

Sun Dec 04 2022 12:11:23 GMT+0530 (India Standard Time)

Ys Sharmila Shared About Ys Vivekanandha Murder Case In Interview

సొంత బాబాయ్ ని ఎవరు హత్య చేశారు. అంత పాశవికంగా దారుణంగా ఎవరు ఈ హత్యకు పాల్పడి ఉంటారు. ఇది అందరి మదినీ దొలిచే అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ విషయంలో బయటవారి ఆలోచనలే అలా ఉంటే సొంత కుటుంబీకులు ఇంకెలా తల్లడిల్లుతారో ఎవరైనా ఊహించవచ్చు. ఇపుడు అదే పరిస్థితి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అనుభవిస్తున్నారు.ఆమె ఒంటరిగా ఈ కేసు విషయంలో పోరాడుతున్నారు. ఆమెకు వైఎస్సార్ కుటుంబం తరఫున వైఎస్ షర్మిల మద్దతు ఇస్తున్నారు. సుప్రీం కోర్టు ఈ కేసులు ఏపీ నుంచి తెలంగాణాలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన తరువాత తొలిసారిగా ఈ కేసు విషయంలో షర్మిల పెదవి విప్పారు. ఆమె ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు.

సుప్రీం కోర్టు ఏపీ నుంచి ఈ కేసుకుని తెలంగాణాకు షిఫ్ట్ చేయడం మంచి తీర్పుగా ఆమె అభివర్ణించారు. ఈ కేసులో త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్లుగా ఆమె చెప్పడం విశేషం. ఈ కేసు విషయంలో సునీత ఏపీ నుంచి హైదరాబాద్ కోర్టుకు కేసుని బదిలీ చేయాలని కోరుకోవడం మంచి నిర్ణయం అని ఆమె అన్నారు. అది ఆమె హక్కుగా కూడా పేర్కొన్నారు.

అదే టైం లో ఏపీ సర్కార్ ని ఈ కేసు విషయంలో నిందించాల్సిన  అవసరం లేదు అన్నట్లుగా ఆమె మాట్లాడం విశేషం. తన సోదరుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కేసు విచారణ జాప్యానికి కారణం అన్న దాని మీద ఆమె ఏకీభవించలేదు. ఏపీలో న్యాయం జరగదు అన్నది వివేకా కుమార్తె సొంత అభిప్రాయం మాత్రమే అని షర్మిల అనడం గమనార్హం.

అంటే అన్న జగన్ పాలనలో ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని విచారణ సక్రమంగా సాగడం లేదని సునీత సహా సీబీఐ సుప్రీం కోర్టులో పేర్కొన్న దాంతో ఆమె ఏకీభవించలేదు అనే అంటున్నారు. ఆ విధంగా ఆమె చెప్పడం ద్వారా తన సోదరుడు మీద ఆయన ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్ చూపించారు అనుకోవాలని అంటున్నారు. నిజానికి షర్మిల కనుక ఇంతకు మించి మరో మాట అన్నా ఏపీ సర్కార్ దే తప్పు అని చెప్పినా అది అతి పెద్ద సంచలనం అయి తీరేది.

కానీ ఆమె అలా అనకపోగా ఆ జోలికే పోకపోవడం ద్వారా రాజకీయ పరిపక్వత చూపించారనుకోవాలి. అదే సమయంలో ఈ కేసు ఎటూ సీబీఐ చూస్తోంది నిజాలు బయటకు వస్తాయి తాను త్వరపడి ఎందుకు అన్న ప్రభుత్వం మీద నిందలు వేసి ఎదురు నిలవాలి అన్న దూరాలోచనతో కూడా ఆమె ఉండి ఉండాలి అంటున్నారు. అయితే ఆమె అదే సమయంలో తెలివిగా ఈ కేసులో తాను సునీత వైపే ఉంటాను అని చెప్పడం ద్వారా పెట్టాల్సిన మెలిక పెట్టారు.

కానీ డైరెక్ట్ గా జగన్ సర్కార్ మీద మాత్రం ఆమె ఎలాంటి విమర్శలు అయితే చేయలేదు. ఇది వైసీపీకి జగన్ కి బాగా ఊరటని ఇచ్చే పరిణామమే అంటున్నారు. షర్మిల కనుక కాస్తా ఏ మాత్రం విమర్శలు చేసినా ఏపీలో జగన్ సర్కార్ మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టేందుకు విపక్షాలు కాచుకుని ఉన్నాయి. మరి వారికి ఆ అవకాశం ఇవ్వకూడదనో లేక తాను రాజకీయం చేయని ఏపీలో ఎందుకు రాజకీయ గందరగోళం అనో ఆమె ఆలోచించే ఇలా మాట్లాడారు అంటున్నారు.

ఇంత జాగ్రత్తలోనూ ఆమె వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తేలాలని పట్టుబట్టడం సీబీఐ వారిని బయటకు తెస్తుంది అని చెప్పడం ద్వారా ఈ కేసు విషయంలో తాను పట్టుదలతో ఉన్నట్లుగానే చెప్పుకున్నారు. మొత్తానికి షర్మిల చేసిన ఈ కామెంట్స్ చాలా బాలన్స్ గా ఉన్నాయనే అంటున్నారు. ఆమె రాజకీయ పరిణతిని అవి చాటి చెబుతున్నాయని కూడా అంటున్నారు. పైగా అన్న జగన్ పట్ల ఆమెకు మనసులో ఏముందో కానీ రాజకీయంగా సోదరుడు తన వల్ల ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు.