Begin typing your search above and press return to search.

అయ్యో షర్బత్ గుల్? నీకీ కష్టాలు ఎప్పటికి తీరవా?

By:  Tupaki Desk   |   28 Nov 2021 9:30 AM GMT
అయ్యో షర్బత్ గుల్? నీకీ కష్టాలు ఎప్పటికి తీరవా?
X
ఫోటో చూసినంతనే ఆమె గుర్తుకు వస్తుంది. ఇంటర్నెట్ లో ఆమె ఫోటోను చూడనోళ్లు ఉండనే ఉండరు. ఆమె గురించి మొత్తం వివరాలు తెలీనప్పటికి ఆమె అఫ్గాన్ మహిళ అని.. శరణార్ధిగా ఉన్న వేళలో తీసిన ఆమె ఫోటో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఆమె కళ్లలో పలికే భావాలు అందరిని విపరీతంగా కదిలించాయి. ఆమెకు ఎదురైన కష్టం గురించి తెలిసి అయ్యో పాపం అనుకునే పరిస్థితి. ఇంతకీ ఆమె పేరు ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.. షర్బల్ గుల్.

దేశం ఏదైనా సరే పాలకులు సమర్థులైతే..ఆ దేశంలో బతికే వారికి ఎలాంటి సమస్యల ఉండవు. కానీ.. ఆ పాలకుల తీరు సరిగా లేకుండా కష్టాలు అన్ని ఇన్ని కావు. పేరుకు దేవ భూమిగా చెప్పుకునే అఫ్గాన్.. శాపగ్రస్తమైన సంగతి తెలిసిందే. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. అఫ్గాన్ మహిళలకు కష్టాలే తప్పించి మరింకేమీ ఉండవు. మధ్యలో వచ్చిన ప్రజా ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటగా మారటం.. మళ్లీ ఆ దేశాన్ని తాలిబన్లు కైవశం చేసుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ కోట్లాది మంది సంగతిని పక్కన పెడితే.. ఒక సగటు అఫ్గన్ మహిళ జీవితాన్ని చూస్తే విషయం మొత్తం ఇట్టే అర్థమవుతుంది.

షర్బత్ గుల్ కు ఎలాంటి ప్రత్యేకత లేదు. ఆమె ఒక సాదాసీదా మహిళ. ఆమెకు పన్నెండేళ్ల వయసులో అఫ్గాన్ ను జాహీర్ షా అనే రాజు పాలించేవారు. నలభై ఏళ్ల పాటు ఒకే రాజు పాలనలో విసిగిన ప్రజలు.. అధికారులు జాహీర్ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్ దావుద్ ఖాన్ కు పాలనా పగ్గాలు అప్పజెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా పలు సంస్కరణలు తీసుకొచ్చాడాయ. అయితే.. ఇదేమీ నచ్చని ప్రతిపక్షం కుట్రలు పన్ని ప్రభుత్వాన్ని పడగొట్టింది. దీంతో అధికారం కోసం మొదలైన కుమ్ములాటలు సాదాసీదా ప్రజానీకాన్నిసమస్యల్లో పడేశాయి.

ఎంతో మంది అఫ్గాన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిలో షర్బత్ గుల్ ఒకరు. పన్నెండేళ్ల చిరుప్రాయంలో కుటుంబంతో పాటు అఫ్గాన్.. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఒక శరణార్ధి శిబిరంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో స్టీవ్ మెకెర్రీ అనే అమెరికన్ ఫోటో గ్రాఫర్ షర్బత్ ను 1984లో చూశారు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు సదరు ఫోటో గ్రాఫర్ ను ఆకర్షించాయి. వెంటనే ఆమె ఫోటోను తీశాడు.

అప్పటి భీకర పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనంలా ఆయన తీసిన ఫోటో నిలిచింది. ఆ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ తన కవర్ పేజీగా 1985లో అచ్చేసింది. అఫ్గన్ అమ్మాయిగా షర్బత్ ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. ఆమె కళ్లు ఎంతో మందిని సూదుల మాదిరి గుచ్చుకునేలా చేసింది. ఆమె ఫోటో ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యింది. అయితే.. తన ఫోటోకు వచ్చిన పాపులార్టీ ఏమీ షర్బత్ కు తెలీదు.

తన సాదాసీదా జీవితంలో మార్పు కూడా ఏమీ లేదు. ఆమెకు పెళ్లి కూడా అయ్యింది. ఆమెకు పదహారేళ్ల వయసులో రహ్మత్ గుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతే ఆమెకు తన ఫోటో గురించి.. దానికి వచ్చిన పాపులార్టీ గురించి తెలుసుకుంది. ఆమెకు నలుగురు పిల్లలు. పాక్ లో జీవిస్తున్న ఆమెకు ముప్ఫై ఏళ్ల వయసులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. 2002 వరకు కూడా షర్బత్ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. ఆమె ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి.. చివరకు ఆమెను గుర్తించారు. ఫోరెన్సిక్ విభాగానికి ఆమె ఫోటో ఇచ్చి ఆమెను గుర్తించారు.

అనంతరం 2012లో అనారోగ్యంతో ఆమె భర్త మరణించారు. 2016లో నలభై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. ఆమె పాక్ లో అక్రమంగా నివసిస్తుందన్న విషయాన్ని గుర్తించిన పాక్ అధికారులు ఆమెకు పదిహేను రోజుల జైలు.. రూ.1.10 లక్షల ఫైన్ వేసి అఫ్గాన్ కు పంపారు. ఆమె గురించి తెలుసుకున్న అఫ్గాన్ ప్రభుత్వం ఆమెను ఒక అపార్ట్ మెంట్లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి ఆమె కుటుంబం అక్కడే ఉంటోంది.

తాలిబన్ల పాలన మొదలు కావటం.. తన జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించిన ఆమె ఇటలీ ప్రభుత్వాన్ని సాయం కోరింది. షర్బత్ పరిస్థితిన అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాని ఆమెకు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ.. ఇప్పుడూ అఫ్గాన్ అమ్మాయిలకు భద్రత లేదన్న విషయం షర్బత్ ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది.