దూసుకుపోతున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు

Tue Aug 16 2022 10:22:52 GMT+0530 (IST)

Shamshabad International Airport

అభివృద్ధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టు చాలా స్పీడుగా దూసుకుపోతోంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో శంషాబాద్ కు ప్రముఖస్ధానం దక్కుతోంది. ఈ ఎయిర్ పోర్టు నుండి ఏడాదికి సుమారు 2 కోట్లమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. అంటే శంషాబాద్ నుండి  రోజుకు 50 వేలమంది ప్రయాణిస్తున్నారు. ప్రతి 3.6 నిముషాలకు ఒక విమానాం టేకాఫ్ అవుతోందంటేనే విమానాశ్రయం ఎంత రద్దీగా ఉంటోందనే విషయం అర్ధమైపోతోంది.అంతర్జాతీయ ప్రయాణాల సంగతిని పక్కనపెట్టేస్తే దేశీయంగా రోజుకు 400 విమానాలు ఇక్కడినుండి రాకపోకలు సాగిస్తున్నాయి. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ హబ్ గా ఉండటం ఈ విమానాశ్రయానికి ఎంతో ఉపయోగంగా ఉంటోంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి రెండువైపులా ఎక్కడికి వెళ్ళాలన్నా 2 గంటల్లోనే చేరిపోవచ్చు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలతో పాటు సింగపూర్ మలేషియా లాంటి దేశాలకు కేవలం ఐదారుగంటల ప్రయాణంలోనే చేరుకోవచ్చు.

అమెరికా లాంటి దూర దేశాలకు వెళ్ళే ప్రయాణీకులు మాత్రం మధ్యలో దుబాయ్ లోనో లేకపోతే జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లోనో కనెక్టింగ్ ఫ్లైట్లలో ఎక్కాలి. అదే అమెరికాకు కూడా డైరెక్టు ఫ్లైట్ వచ్చేస్తే శంషాబాద్ విమనాశ్రయంలో రద్దీ మరింత పెరిగిపోవటం ఖాయం. బహుశా ఇలాంటి డెవలప్మెంట్లను దృష్టిలో పెట్టుకునే విమానాశ్రయాన్ని విస్తరించాలని జీఎంఆర్ కంపెనీ నిర్ణయించింది. ఏడాదికి 5 కోట్లమంది ప్రయాణించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని విస్తరించాలని డిసైడ్ అయ్యింది.

8500 కోట్ల రూపాయలతో చేపట్టబోయే విస్తరణ పనుల్లో జీఎంఆర్ సిటి నిర్మాణం కీలకమైనది. ఈ సిటీకి జీఎంఆర్ ఏరోసిటిగా కంపెనీ పెరుపెట్టింది. 1500 ఎకరాల్లో సిటీ నిర్మాణం మొదలవ్వబోతోంది. ఇందులో విమానాశ్రయం విస్తరణతో పాటు  రెస్టారెంట్లు సర్వీసు అపార్ట్ మెంట్లు ఇండిపెండెంట్ విల్లాలు ఆసుపత్రులు క్లబ్బులు హోటల్స్ ఐటి సంస్ధల కార్యాలయాలకు స్పేస్ ఏర్పాటు షాపింగ్ మాల్స్ వినోదకేంద్రాలుంటాయి. మొత్తానికి తొందరలోనే శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే నెంబర్ 1గా నిలవటం ఖాయమనే అనిపిస్తోంది.

చంద్రబాబు  - వైఎస్ కలిసి సృష్టించిన హిస్టరీ

కేంద్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ ను విస్తరించమని ఏపీకి సూచించింది. కానీ భవిష్యత్తు అవసరాలకు సరిపోదని కేంద్రం ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ ప్రాంతాన్ని ఇవ్వండి అని చంద్రబాబు అడిగితే కేంద్రం ఒప్పుకోలేదు. దీంతో 1998 డిసెంబరులో చంద్రబాబు రెండు జాతీయ రహదారులకు మధ్యన ఉన్న శంషాబాద్ ను ఫైనల్ చేశారు. దానిని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు వేసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేశారు. చంద్రబాబు హయాంలో కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కలిసి పూర్తి సహకారం అందిస్తూ జీఎమ్మార్ తో ఒప్పందం చేసుకున్నాయి. తర్వాత పనులు మొదలయ్యాయి. వైఎస్సార్ హయాంలో ఈ ఎయిర్ పోర్ట్ పనులు పూర్తయ్యాయి. 2008లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం అయ్యింది.