ఏపీ స్పీకర్ కి ఢిల్లీలో ఘోర అవమానం ..ఏమైందంటే ?

Mon Dec 23 2019 11:24:46 GMT+0530 (India Standard Time)

Shame For AP Speaker In Delhi

ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఢిల్లీలోని ఏపీ భావం లో ఘోర అవమానం జరిగింది. ప్రోటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి తన గౌరవ మర్యాదలకు విలువ ఇవ్వకపోవటం పైన స్పీకర్ తమ్మినేని మనస్థాపానికి గురయ్యారు. అలాగే అక్కడి అధికారుల తీరుపై కూడా ఫైర్ అయ్యారు. ఆయన సతీమణి సైతం ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో వ్యవహరించే తీరు పైన ప్రభుత్వం సమాచారం కోరినట్లు తెలుస్తోంది.అసలేమైందంటే ...డెహ్రాడున్ లో జరిగిన స్పీకర్ల సదస్సుకు ఏపీ స్పీకర్ తమ్మినేని కుటుంబంతో సహా హాజరయ్యారు. అక్కడి నుండి ఏపీకి వచ్చేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.  ఆ తరువాత  ఢిల్లీలోని ఏపీ భవన్ కి వెళ్లడంతో  ఆయనకు అక్కడ స్వర్ణముఖి బ్లాక్ లోని 320 గెస్ట్ రూమ్ ను కేటాయించారు. కానీ తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దం అవుతున్న సమయంలో ఏపీ భవన్ ఉద్యోగి ఒకరు ఆయన వద్దకు వచ్చి ఆయనకు అందించిన భోజన..వసతి బిల్లు కట్టమన్నారూ అంటూ పుస్తకం మీద సంతకం చేయాలని కోరారు. రాష్ట్ర అతిధి హోదాలో ఉన్న తనను బిల్లు అడగటంతో ఒక్కసారిగా స్పీకర్ విస్తుపోయారు.

ఆయనకు కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారని..ఏపీ సచివాలయం నుండి స్టేట్ గెస్ట్ గా కాకుండా..కేటగిరీ-1లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని ఏపీ భవన్ సిబ్బంది వివరించారు. దీని వలనే బిల్లు చెల్లించాల్సి వస్తుందని..అది అమరావతి సచివాలయంలోనే జీఏడీ నుండి జరిగిన పొరపాటు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది స్పీకర్ ని తీవ్రంగా అవమానించడమే అనే వ్యాఖ్యలు మొదలైయ్యాయి. ఈ విషయంలో  స్పీకర్  తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. ముందు బిల్లు చెల్లించేయండి..తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ తన వ్యక్తిగత సిబ్బందికి సూచన చేసారు అని తెలుస్తుంది. ఆ సమయంలో స్పీకర్ సతీమణి సైతం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దామని.. తమకు అవమానం జరిగిందని బాధపడినట్లుగా సమాచారం.  

ఈ వ్యవహారం పై కొంచెం ఆలస్యంగా తేరుకున్న ఏపీ భవన్ అధికారులు.  స్పీకర్ తమకు స్టేట్ గెస్ట్ అని ఆయన విడిది ఉన్నందుకు బిల్లు కట్టాలని అడగడం  తప్పేనని ఏపీ భవన్ అధికారులు ఆ తరువాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే దీని పైన స్పీకర మాత్రం ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జరిగిన ఈ అవమానం పై జీఏడీ అధికారులను వివరణ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.