థైరాయిడ్ గ్రంధి పై కొవిడ్ తీవ్ర ప్రభావం

Fri Jul 01 2022 05:00:01 GMT+0530 (IST)

Severe effect of Covid on the thyroid gland

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. అది సోకిన వారి ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. కొవిడ్ నుంచి కోలుకుని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా తరచూ ఏదో రకమైన అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. మొదట్లో కొవిడ్ శ్వాస గుండె సంబంధిత వ్యవస్థపై ప్రభావం చూపింది కానీ పరిశోధనల్లో మాత్రం రోజుకో కొత్త సమస్య బయటపడుతుంది. కొవిడ్ వైరస్ తీవ్ర రూపం దాలిస్తే థైరాయిడ్ గ్రంధి పై తీవ్ర ప్రభావితం చేస్తుంది ఇటలీలోని మిలాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.కరోనా సోకి తగ్గిన తర్వాత దాని ప్రభావం చాలా అవయవాలపై పడుతోంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు గుండెపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. అయితే తాజాగా.. ఇటలీలోని మిలాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం బయటపడింది.

కొవిడ్ తీవ్ర రూపం దాలిస్తే.. థైరాయిడ్ గ్రంథి ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధనలో తేలింది. ఆ దుష్ప్రభావం ఏడాది గడిచిన తర్వాత కూడా కనిపిస్తోందని ఈ అధ్యయనం వెల్లడించింది.

కొవిడ్ లక్షణాల తీవ్రత మధ్యస్థంగానూ తీక్షణ స్థాయిలోనూ ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి వాపునకు గురవుతుందని పరిశోధకులు తెలిపారు. మెదడులోని హైపోథాలమస్- పిట్యూటరీ- థైరాయిడ్ గ్రంథులు కొవిడ్ దుష్ప్రభావానికి గురవుతున్నాయని తేల్చారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుందని మిలాన్‌లో 24వ ఐరోపా వినాళగ్రంథుల శాస్త్ర మహాసభకు సమర్పించిన అధ్యయన నివేదికలో ఇటాలియన్ శాస్త్రజ్ఞులు వివరించారు.

మానవ దేహంలో జీవక్రియలకు ఎదుగుదలకు థైరాయిడ్ గ్రంథి చాలాముఖ్యం. స్త్రీలు గర్భిణులుగా ఉన్నప్పుడూ థైరాయిడ్ ఎక్కువ హార్మోనులను విడుదల చేస్తుంది. శరీరానికి కావాల్సిన అదనపు శక్తి ని అవి సమకూరుస్తాయి. తీవ్ర కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన 100 మందిపై దీర్ఘ అధ్యయనం చేయగా వారిలో  తరచుగా థైరాయిడ్ వాపు కనిపించింది.

కొవిడ్ తగ్గిన తరవాత అందరిలో థైరాయిడ్ పనితీరు సాధారణ స్థితికి వచ్చింది. కానీ 12 నెలల తరవాత కూడా సగం మందిలో థైరాయిడ్ వాపు చిహ్నాలు పూర్తిగా తొలగిపోలేదు. అల్ట్రాసౌండ్ పరీక్షలో దాని ఆనవాళ్లు కనిపించాయి. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.