టీవీ ఆర్టిస్టులు భారతీయ జనతా పార్టీలోకి క్యూ!

Thu Jul 18 2019 23:00:01 GMT+0530 (IST)

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ తన ప్రత్యర్థులకు  దడ పుట్టిస్తోంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో సంచలన విజయం సాధించింది బీజేపీ. ఊహించని రీతిలో టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చి బీజేపీ సంచలనం రేపింది. పద్దెనిమిది మంది ఎంపీలను ఆ రాష్ట్రంలో గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ అక్కడ అసెంబ్లీ సార్వత్రిక  ఎన్నికల నాటికి మరింతగా పుంజుకునేలా అడుగులు వేస్తూ ఉంది.లోక్ సభ ఫలితాలకూ - అసెంబ్లీ ఫలితాలకూ తేడా ఎంత వరకూ ఉంటుందో కానీ.. బీజేపీ దూకుడు మాత్రం మమతా బెనర్జినీ దించి తాము బెంగాల్ పీఠాన్ని ఆక్రమించాలనేంత స్థాయిలో ఉంది.

ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ అంటోంది. ఏకంగా ప్రధానమంత్రి మోడీనే ఆ ప్రకటన చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు అదే విషయాన్ని ఘంటాపథంగా చెబుతూ ఉన్నారు.

ఆ ప్రకటనలతో మమతా బెనర్జీ కూడా గందరగోళానికి లోనవుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. తన పార్టీలో ఉన్న వారిని కూడా ఆమె నమ్మలేకపోతోందని.. ఎవరు తనవారో - ఎవరు బీజేపీతో టచ్లో ఉన్నారో ఆమెకు అంతుబట్టడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఆ సంగతలా ఉంటే.. బెంగాల్లోని విభిన్న వర్గాల వారు వరసగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం మాత్రం కొనసాగుతూ ఉంది.అందులో భాగంగా తాజాగా కొంతమంది టీవీ ఆర్టిస్టులు బీజేపీలోకి చేరారు అక్కడ. దాదాపు డజను మందికి పైగా టీవీ సీరియల్ ఆర్టిస్టులు బీజేపీలోకి చేరారట. వారంతా జాయింటుగా చేరడం గమనార్హం!

ఇలాంటి వారితో ప్రజాబలం ఎంత వరకూ కలిసి వస్తుంది అనే సంగతిని పక్కన పెడితే.. గ్లామరస్ ఫీల్డ్ కు సంబంధించిన వారు వరస పెట్టి చేరుతూ ఉండటం మాత్రం బీజేపీకి ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా మారుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.