Begin typing your search above and press return to search.

గుట్టుగా ఆ సైట్లు చూసినా ఆ రాష్ట్రంలో ఏడేళ్లు జైలు?

By:  Tupaki Desk   |   9 Dec 2019 9:29 AM GMT
గుట్టుగా ఆ సైట్లు చూసినా ఆ రాష్ట్రంలో ఏడేళ్లు జైలు?
X
మీ ఇంట్లో మీరు ఉంటారు. మీదైన ప్రపంచంలో మీకు నచ్చిన పోర్న్ సైట్లను గంటల తరబడి చూస్తుంటే ఇప్పటివరకూ ఎవరూ ఏమీ అనకున్నా.. ఇప్పుడు అందుకు భిన్నంగా తిప్పలు తప్పవని హెచ్చరికలు వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లు.. ట్యాబ్.. కంప్యూటర్.. స్మార్ట్ టీవీ.. ఇలా దేనిలో అయినా సరే.. ఆన్ లైన్ లో అదే పనిగా గంటల కొద్దీ అశ్లీల వీడియోల్ని చూస్తుంటే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు తమిళనాడు పోలీసులు.

ఇప్పటికే దీనికి సంబంధించి మూడు వేల మందిని గుర్తించి.. వారిని వ్యక్తిగతంగా పిలిపించుకొని కౌన్సెలింగ్ చేసే పనిని షురూ చేసిన వైనం ఇప్పుడు వెలుగు చూసింది. అదే పనిగా పోర్న్ వీడియోలు చూసే వారిని వారి ఐపీ అడ్రస్ ల ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో చోటు చేసుకున్న దిశ హత్యాచార ఉదంతంలో నిందితులు నలుగురు తమ ఫోన్లలో అదే పనిగా అశ్లీల వీడియోలు చూసే వారన్న సమాచారంతో ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు అలెర్ట్ అయిపోతున్నారు.

ఇందులో భాగంగా తమిళనాడు పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా అదే పనిగా రోజూ గంటల కొద్దీ అశ్లీల వీడియోల్ని చూసే మూడు వేల మందిని గుర్తించారు. తరచూ పోర్న్ సైట్లను వారు చూడటాన్ని ట్రాక్ చేయటమే కాదు.. ఇప్పటికే కొందరిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు.. గుట్టుగా అశ్లీల సైట్లను వీక్షించే వారికి ఏడేళ్లు జైలుశిక్ష విధించేలా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరే సంఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. అదే పనిగా అశ్లీల వీడియోల్ని చూసే పదిహేను మందిని తిరునల్వేలిలో గుర్తించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా వార్నింగ్ ఇచ్చే సమయంలో ఏడేళ్ల జైలుశిక్ష అంటూ మందలించిన ఆడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. ఇక మీదట తాను ఆ వీడియోల్ని చూడనని సదరు యువకుడు బోరుమనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో.. గుట్టుగా ఆ సైట్లను చూసినా చిక్కులు తప్పవన్నది మర్చిపోవద్దు సుమా?