టాలీవుడ్ విషాదం.. ఇద్దరు టీవీనటుల దుర్మరణం

Wed Apr 17 2019 10:47:51 GMT+0530 (IST)

Serial Actors Bhargavi And Anusha Reddy Died In A Road Accident

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వర్ధమాన టీవీ నటులు దుర్మరణం చెందిన సంఘటన హైదరాబాద్ శివారు చేవెళ్లలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో మరో నటుడు - కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలపాలయ్యారు.ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారమవుతున్న ఓ టీవీ సీరియల్ చిత్రీకరణలో భాగంగా వర్ధమాన టీవీ ఆర్టిస్టులు నిర్మల్ జిల్లాకు చెందిన భార్గవి (20) - భూపాలప్లి జిల్లాకు చెందిన అనుషా రెడ్డి (21) - మరో నటుడు వినయ్ కుమార్ లు కారులో హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడువులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ క్రమంలోనే మొయినాబాద్ మండలం అప్పారెడ్డి గూడ బస్టాప్ సమీపంలో  తెల్లవారుజామున వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో  కారులో ప్రయాణిస్తున్న భార్గవి - అనుషారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వినయ్ - డ్రైవర్ చక్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.  కాగా వర్ధమాన టీవీ నటుల మృతితో టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.