Begin typing your search above and press return to search.

జాట్లు ఎవ‌రి జాత‌కం మారుస్తారో?

By:  Tupaki Desk   |   20 Jan 2022 9:39 AM GMT
జాట్లు ఎవ‌రి జాత‌కం మారుస్తారో?
X
దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అక్క‌డ అధికారంలోకి వ‌స్తే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ విజ‌యం కోసం పోరాడుతున్నాయి. అధికార బీజేపీతో పాటు స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలోని జాట్లు ఎవ‌రి వైపు మొగ్గుచూపుతార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. జాట్ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఎటువైపు ఉంటే అధికారం అటువైపు ఉంటుంద‌నే మాట యూపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటుంది.

ఆ 90 సీట్ల‌లో..

ప‌శ్చిమ యూపీలోని 110 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 90 సీట్ల‌లో గెలుపోట‌ముల‌ను జాట్లు ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు. గ‌త ఎన్నిక‌ల్లో వీళ్లు బీజేపీకి మ‌ద్దతుగా నిలిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఆ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. కానీ ఇప్పుడు నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా జ‌రిగిన రైతు ఉద్య‌మంలో జాట్ల‌తో పాటు ఈ ప్రాంతంలోని మ‌రో బ‌ల‌మైన వ‌ర్గం గుర్జ‌ర్లు క‌లిసి పోరాడారు. దీంతో ఇప్పుడు ప‌శ్చిమ యూపీ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం మారిపోయింది. యూపీలో తొలి రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగే 113 నియోజ‌క‌వ‌ర్గాల్లో జాట్లు, గుర్జ‌ర్లు ప్ర‌ధాన ఓట‌ర్లుగా ఉన్నారు. దీంతో వీళ్ల ప్ర‌భావం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందోన‌న్న చ‌ర్చ సాగుతోంది. ప‌శ్చిమ యూపీలో జాట్ల జ‌నాభా 18 శాతం.. ఇక యూపీలో ముస్లింలు కూడా దాదాపు 18 శాత‌మే. వీళ్లు క‌లిస్తే బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచే ప్ర‌మాదం ఉంది.

ఆ ఘ‌ర్ష‌ణ‌ల‌తో..

2013లో ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన మ‌త‌ప‌ర‌మైన అల్ల‌ర్ల‌తో జాట్లు బీజేపీకి మ‌ద్దతుగా నిలిచార‌ని అంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో 71 శాతం, 2019 ఎన్నిక‌ల్లో 91 శాతం జాట్లు బీజేపీకి ఓటు వేశారు. ఆ అల్ల‌ర్ల కార‌ణంగా బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ, స‌మాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ కులాల స‌మీక‌ర‌ణాలు దెబ్బ‌తిని అది బీజేపీకి లాభంగా మారింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప‌రిస్థితి మారేలా ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. తిరిగి జాట్ల మ‌ద్ద‌తు సాధిస్తామ‌ని రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ చెబుతోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న స‌మాజ్‌వాదీ పార్టీకి ఇది ల‌బ్ధి చేకూర్చేదే. మ‌రోవైపు పశ్చిమ యూపీలో అభివృద్ధి చూసి ప్ర‌జ‌లు త‌మ‌కు ఓట్లు వేస్తార‌ని బీజేపీ చెబుతోంది. అయితే రైతు చ‌ట్టాల విష‌యంలో మాత్రం బీజేపీపై జాట్లు గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ చట్టాల‌ను మోడీ వెన‌క్కి తీసుకున్న‌ప్ప‌టికీ బీజేపీ వాళ్లు అసంతృప్తితోనే ఉన్నార‌ని టాక్‌. మ‌రోవైపు రైతుల‌కు మ‌ద్దతు ఇచ్చిన రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌, స‌మాజ్‌వాదీ పార్టీ ఆ ఓటు బ్యాంకు త‌మ‌వైపు తిప్పుకునే అవ‌కాశం ఉంది.