Begin typing your search above and press return to search.

అమెజాన్ పై సంచలన కథనం

By:  Tupaki Desk   |   14 Oct 2021 8:08 AM GMT
అమెజాన్ పై సంచలన కథనం
X
అమెజాన్.. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా ప్రఖ్యాతి గాంచింది.
పోటీ ప్రపంచంలో కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తువులు కొనేలా చేసి అత్యధిక లాభాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే లాభాలే ధ్యేయంగా పనిచేసే క్రమంలో ఈ-కామర్స్ కింగ్ ‘అమేజాన్’ దిగజారి ప్రవర్తిస్తోందని తాజాగా రాయిటర్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ‘ఇండియా ప్రైవేట్ బ్రాండ్స్ ప్రోగ్రామ్’ పేరుతో సేకరించిన పత్రాల వివరాలను తాజాగా వెల్లడించింది.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్ లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నది రాయిటర్స్ కథనంలో ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడిస్తూ అందులో భారత ప్రస్తావన కూడా రాయిటర్స్ సంస్థ తీసుకొచ్చింది.

అమెజాన్ ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం.. వాటిని ప్రమోట్ చేయడంలోనూ అమెజాన్ టాప్ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్ ప్రధాన ఆరోపణ. భారత్-అమెజాన్ మార్కెట్ లో లోకల్ బ్రాండ్ లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని.. ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదురు కథనం పేర్కొంది.

అంతేకాదు.. ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది. కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్.. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్ కు ఎక్కువగా బలైందని వెల్లడించింది.

అమెజాన్ కు సంబంధించిన బ్రాండ్ లతో పాటు అమెజాన్ టాప్ ప్రయారిటీ ఉన్న బ్రాండ్ లనే వినియోగదారులకు టాప్ సెర్చ్ లో చూపిస్తోందనే ఆరోపణ వచ్చింది. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాలను చవిచూసిన అమెజాన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్ కథన సారాంశం.

అయితే ఈ ఆరోపణలపై అమెజాన్ ఇంతవరకూ స్పందించలేదు. ఖండించలేదు.