ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

Thu May 26 2022 11:00:15 GMT+0530 (IST)

Sensational Decisions Taken by PM Modi

వివాదాస్పద నిర్ణయాలు.. అనేక చట్టాలు.. కీలక అడుగులు.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు.. వీటన్నిటి నుంచి తట్టుకొని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఏనిమిదేళ్లు పూర్తి చేసుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ అనేక కీలక అడుగులు వేశారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకోగలిగారు.  అయితే 'ఎప్పుడూ నెగ్గడమే కాదు.. అప్పుడప్పుడు తగ్గాల్సిందే..' అన్నట్లుగా కొన్ని విషయాల్లో నరేంద్ర మోదీ వెనుకడుగు వేశారు. ప్రజా వ్యతిరేకత తీవ్రమైన సందర్భాల్లో వారికి అనుగుణంగా నడుచుకోగలిగారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్డీ ఏ ప్రభుత్వం మొత్తం 1500 చట్టాలను రద్దు చేసింది.  అలాగే చట్టాల్లోని 25వేల అంశాలను తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మోదీ తీసుకున్న సంచలనాల నిర్ణయాల గురించి తెలుసుకుందాం..  నరేంద్ర మోదీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన నేత. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనేక దేశాల్లో పర్యటించారు. సమయానుకూలంగా ఆయా దేశాధినేతలను కలుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే అటు బైడెన్ తో భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా మోదీ అడిగిన ఒక్క మాట కోసం యుద్ధానికి కాసేపు విరామం ఇవ్వడంపై వివిధ దేశాధినేతలు ఆశ్చర్యపోయారు. విదేశాల్లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందిన నరేంద్ర మోదీ దేశంలో కొన్ని చట్టాల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతు చట్టాలను ప్రవేశపెట్టి రైతుల ఆగ్రహానికి గురయ్యారు. అలాగే దేశద్రోహ చట్టంపై మోదీ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు వ్యతిరేకించింది.

వ్యవసాయ చట్టాలు: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం రైతు చట్టాలను ప్రవేశపెట్టింది. నాలుగు రకాల చట్టాలను ఉభయసభల్లో ఆమోదింపచేసింది. అయితే ఈ చట్టాలతో రైతులకు అన్యాయం జరగుతుందని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. పంజాబ్ ఉత్తరప్రదేశ్లో మొదలైన ఈ ఆందోళన ఢిల్లీ వేదికగా ఏడాదిపాటు కొనసాగింది. ఈ ఆందోళనను విరమింపజేయడానికి మోదీ చేసిన ఎలాంటి ప్రయత్నం ఫలించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ఆందోళనను కొనసాగించారు. దీంతో ఈ చట్టాల విషయంలో మోదీ వెనుకడుగు వేశారు. 2011 నవంబర్లో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

దేశద్రోహ చట్టం: ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై దేశద్రోహ చట్టం కింద అభియోగాలు మోపాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో కొందరు సుప్రీంను ఆశ్రయించడంతో కేంద్రంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వలసవాదకాలం నాటి ఈ చట్టాన్ని పున పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకు కేంద్రం తెలిపింది. అంతేకాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ కింద ఎలాంటి ఎఫ్ ఐఆర్ నమోదు చేయొద్దని కేంద్రం రాష్టాలకు తెలిపింది.

370 ఆర్టికల్ రద్దు: జమ్మూకాశ్మీర్ లో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేసిన వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2019లో తీసుకున్న ఈ నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా కేంద్ర వెనక్కి తగ్గలేదు. అంతేకాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ అభివృద్ధి చేయాలని నిధులు కూడా మంజూరు చేస్తోంది.

భూసేకరణ బిల్లు: ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో తీసుకున్న సంచలన నిర్ణయం ఇది.  అయితే కొన్ని వర్గాల రైతుల నుంచి విమర్శలు రావడంతో పున: పరిశీలించేందుకు అంగీకరించింది. భూ యజమానుల అనుమతి లేకుండా భూసేకరణ చేయడంతో పాటు సామాజిక ప్రభావ అంచనాను చేపట్టడం కోసం మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందినా.. ఎగువ సభలో ఓడిపోయింది.