Begin typing your search above and press return to search.

సంచలనంగా ఏపీ బీజేపీ నేతల చీకటి డీల్!

By:  Tupaki Desk   |   1 March 2021 5:30 AM GMT
సంచలనంగా ఏపీ బీజేపీ నేతల చీకటి డీల్!
X
ఏపీలో జరిగిన ఒక చీకటి ఒప్పందం తాలుకూ అంశాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ బయటపెట్టింది. సంచలనంగా మారిన ఈ ఇష్యూలో కర్త..కర్మ.. క్రియ అన్ని ఏపీ బీజేపీకి చెందిన నేత కావటం షాకింగ్ గా మారింది. అవినీతి మచ్చ లేకుండా.. కుంభకోణాల కంపు లేకుండా సాగే బీజేపీ నేతలకు భిన్నంగా ఏపీ బీజేపీ నేత చేసిన గలీజు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు రాయలసీమలో నడిచే ఒక ప్రముఖ ఆశ్రమం చేసిన రూ.400 కోట్ల ఆర్థిక అవకతవకల నుంచి బయటపడేసేందుకు సాయం చేసి అందుకు ప్రతిఫలంగా రూ.30 కోట్లు తీసుకున్నట్లుగా సదరు మీడియా సంస్థ ఆరోపించింది.

అందుకు సంబంధించిన ముఖ్యాంశాల్ని చూస్తే..

- సీమలోని ఒక అశ్రమంలో అక్రమ సొమ్ము భారీగా ఉంది. దాని విలువ ఏకంగా రూ.400 కోట్లు. దీని గురించి సమాచారం సేకరించిన ఈడీ.. ఐటీ విభాగాలు అది నిజమేనని తేల్చాయి. కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టాయి. దీంతో ఆశ్రమ నిర్వాహకులు దీని నుంచి బయటపడేందుకు ఎలా? అని ఆలోచిస్తున్న వేళ.. సీమకు చెందిన ఒక బీజేపీ నేత ఇష్యూను సెటిల్ చేస్తానని రంగంలోకి దిగాడు.

- ఒకప్పుడు పార్టీ ఎమ్మెల్యే ఆఫీసులో పని చేసిన ఆ వ్యక్తికిమాటలు చెప్పటంతోపాటు అధికారంలోఉన్న నేతల్ని బుట్టలో వేసుకొని కోట్లు గడించారన్న పేరుంది. గత ప్రభుత్వంలో తన సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రితో భారీ లావాదేవీలు చేశారన్న ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు కూడా తన సామాజిక వర్గానికే చెందిన కేబినెట్ ర్యాంకు నేతతో బెంగళూరులో భారీగా పైరవీలు చేస్తారన్న మాట ఉంది.

- తనకు కేబినెట్ మంత్రి హోదా పదవి ఉందని.. తాను చెబితే ఢిల్లీ నుంచి సదరు కేసు దర్యాప్తు అధికారులే ఇక్కడకు వస్తారని చెప్పాడు. దీంతో ఆ నాయకుడి మాటకు ఓకే చెప్పిన ఆశ్రమ పెద్ద మనిషి రూ.30 కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. కేంద్ర విచారణ సంస్థలు తమ మీద వేసిన కన్నును మూసుకునేలా చేయాలన్నది ఒప్పంద సారాంశం.

- డీల్ లో భాగంగా రాయలసీమ నేతకు రూ.3 కోట్లు.. వేరే రాష్ట్రం నుంచి తిరుపతిలో మకాం వేసి ఢిల్లీ నుంచి కేంద్ర సంస్థల అధికారిని రప్పించిన మరోనేతకు రూ.7 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.20 కోట్లు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర సంస్థ అధికారికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలా చేతులు మారిన రూ.30 కోట్లకు చెందిన వివరాల్ని కేంద్రం సేకరించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర నిఘా సంస్థల వరకు వెళ్లటం.. కేంద్రంలోని పెద్ద తలకాయలకు సమాచారాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

- మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. అవినీతి విషయంలో ప్రధాని మోడీ కఠినంగా ఉంటారన్న పేరుంది. మరి.. ఈ డీల్ వెనుకున్న నేతల విషయంలో పార్టీ.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరో నాలుగు రోజుల్లో కేంద్రమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ఉండటంతో.. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత ఇరువురు నేతల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.