Begin typing your search above and press return to search.

పాజిటివ్ లెక్కల దాపరికం బట్టబయలు చేశారు!

By:  Tupaki Desk   |   18 April 2021 1:30 PM GMT
పాజిటివ్ లెక్కల దాపరికం బట్టబయలు చేశారు!
X
మొదటిదశలో కరోనా మరణాల్ని దాచి పెట్టినట్లుగా పేర్కొంటూ.. దానికి సంబంధించిన వివరాల్ని ఆధారాలతో పాటుగా చూపించి సంచలనంగా మారిందో మీడియాసంస్థ. తాజాగా అదే మీడియా సంస్థ.. మరో సంచలనానికి తెర తీసింది. రెండో దశలో భారీగా కేసులు నమోదవుతున్న వేళ.. అందుకు భిన్నంగా ప్రభుత్వం తన నివేదికలో వెల్లడిస్తున్న కేసులకు పొంతన లేని వైనాన్ని లెక్కలతో బయటపెట్టి సంచలనంగా మారిందో ప్రముఖ మీడియా సంస్థ.

తాజాగా సదరు మీడియా సంస్థకు చెందిన ప్రతినిధులు.. హైదరాబాద్ మహానగరంలోని పది ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కేంద్రాల్లో కరోనాపాజిటివ్ టెస్టుల కోసం ఎంతమంది ఉన్నారో సమాచారాన్ని సేకరించారు.

అందులో పాజిటివ్ లు అయిన వారెందరో లెక్క తీసుకున్నారు. రోజు ఆగిన తర్వాత.. ప్రభుత్వం అధికారికంగా తన లెక్కల్ని వెల్లడించిన తర్వాత.. తాము సేకరించిన సమాచారాన్ని.. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల్ని బయటపెట్టారు. దీంతో.. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం..జీహెచ్ఎంసీ పరిధిలో 598 కరోనా కేసులుగా పేర్కొంది. అంటే.. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెస్టులకు సంబంధించిన వివరాల్ని క్రోడీకరించి.. ఈ నివేదికను విడుదల చేస్తారు. అయితే.. ప్రముఖ మీడియా సంస్థ.. శుక్రవారం ఉదయం హైదరాబాద్ మహానగర పరిధిలోని పది పరీక్ష కేంద్రాల్ని పరిశీలించింది.

సదరు మీడియా సంస్థ లెక్కల ప్రకారం సదరు పది కేంద్రాల్లో 1487 మందికి పరీక్షలు జరిపగా.. 416 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. అంటే..పది కేంద్రాల్లోనే 416 పాజిటివ్ లు వస్తే.. హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా ఉండే 126 ప్రభుత్వ.. 70-80 మధ్య ఉండే ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను కలుపుకుంటే.. మొత్తం ఎన్ని కేసులు రావాలి? అన్నది ప్రశ్న. ఇంకో లెక్క ప్రకారం చూస్తే.. రాష్ట్రప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 9 వేల నుంచి 11 వేల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. 1487 పరీక్షలకు 416 పాజిటివ్ లుగా తేలటం అంటే.. 25 శాతం సగటున ఉంటుంది. ఇందులో కాస్త తగ్గించి 20 శాతం అనుకున్నా.. పది వేల పరీక్షలకు 2 వేల పాజిటివ్ లు రావాల్సి ఉంటుంది. కానీ.. 598 పాజిటివ్ లుగా వెల్లడించటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

కేసుల్ని దాచటం వల్ల జరిగే నష్టం ఎంతో. ప్రజల్లో తక్కువ కేసులు నమోదువు అవుతున్నాయంటే.. ఒకింత నిర్లక్ష్యం ఉంటుంది. కానీ.. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం.. ఎవరికి వారిని అప్రమత్తం అయ్యేలా చేయటమే కాదు.. మరిన్నిజాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు. పాజిటివ్ కేసులకు సంబంధించి సదరు మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.