Begin typing your search above and press return to search.

మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:05 PM GMT
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి ?
X
రాయపూర్: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఏవోబీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్నట్లు సమాచారం. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన మృతిని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ధృవీకరించారు. మావోయిస్ట్ పార్టీలో ఆర్కే కేంద్రకమిటి హోదాలో పనిచేస్తున్నారు. 2016లో బలమిల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కాలికి గాయమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ గాయం వల్లే ఆయన అనారోగ్యానికి గురయి చనిపోయినట్లు చెబుతన్నారు. బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందారు.

ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించారు. సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారని చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసుల నుంచి తప్పించుకున్నారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. 2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేది గుంటూరు జిల్లా గుత్తికొండ బిలం. ఆయన కారంచేడు దళిత ఉద్యమం ప్రేరణలో విప్లవోద్యయంలోకి వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. దగ్గబాటి వెంకటేశ్వరావు హత్య కేసులో ఆర్కే నిందితుడు. ఆయన భార్య శిరీష ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసముంటున్నారు. ఆర్కే మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన తోడల్లుడు, విరసం నేత కళ్యాణ రావు తెలిపారు.