చంద్రబాబూ విన్నారా - టీడీపీని పవన్ ఓడించాడట

Sat Jun 15 2019 20:00:01 GMT+0530 (IST)

పవన్ గెలవకపోయినా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. దీనికి సినిమా నేపథ్యం కావడం ఒక కారణమైతే అతని ఆవేశపూరితమైన ఆట్యిట్యూడ్ ఇంకో కారణం. తాజాగా పశ్చిగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సీనియర్ నటుడు సుమన్ పవన్ కళ్యాణ్ మీద ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.టీడీపీ ఓటమికి కారణాలేమిటో నిన్నటి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే కదా. మరి దానికి సమాధానం అన్నట్టుగా నటుడు సుమన్ యాదృశ్చికంగా స్పందించారు. ఏపీలో తెలుగుదేశం ఓడిపోవడానికి పవన్ కల్యాణే కారణమని సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా నిన్న ఈ మాట అనలేదు. మరుసటి రోజు ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యకరమే.

నాకు బుద్ధొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు. జగన్ అసాధారణ విజయం సాధించారు. తదనంతరం కూడా తన ముద్ర వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సమన్యాయం చేయడం తనకు బాగా నచ్చిందని సుమన్ వ్యాఖ్యానించారు.

తెలుగుదేశంపై ఎన్నికల ముందు జనసేన  అధిపతి పవన్ కళ్యాణ్ పలు అవినీతి ఆరోపణలు చేశారు. అయితే టీడీపీ కంటే ఎక్కువగా ఆయన జగన్ పై అనేక ఆరోపణలు చేశారు. ఏనాడూ అధికారంలో లేని జగన్ పై పవన్ చేసిన విమర్శలు జగన్ కి నష్టం చేయకపోగా పవన్ కి టీడీపీకి నష్టం చేశాయని వాదన ఉన్న నేపథ్యంలో సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇక సినిమా పరిశ్రమ విషయంలోనూ అతను ఓ కామెంట్ చేశారు. సినిమా పరిశ్రమను కూడా ఏపీకి తీసుకొచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని జగన్ ను కోరారు.