వైసీపీ నేతల్లో ఆత్మన్యూనత.. రీజన్ ఇదేనా...?

Sun May 22 2022 08:00:01 GMT+0530 (IST)

Self loathing among YCP leaders Is this the reason

ఔను.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులకు ఆత్మన్యూనత పెరిగిపోయిందనే టాక్ వి నిపిస్తోంది. అంటే.. వీరు ప్రజల్లోకి వెళ్లాలంటేనే.. భయపడుతున్నారు. దీంతో చాలా మంది నాయకులు ఇంటి గడప కూడా దాటడం లేదు. దీనికి తోడు.. ఆర్థికంగా కూడా.. వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇది నిజమే. పార్టీ అధికారంలో ఉన్నా.. నాయకుల దగ్గర డబ్బులు లేక పోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు.. దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వైసీపీ గడప గడపకు ప్రభుత్వం ప్రారంభించింది.దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. మంత్రులు ఎమ్మెల్యేలు.. ఇలా.. నాయకులు అందరూ.. ప్రజలను కలవాలని.. ప్రభుత్వ సంక్షేమంపై వివరించాలని.. సీఎం జగన్ సూచించారు. అయితే.. ఇలా ఇప్పటి వరకు 50 నియోజకవర్గాల్లోనే నాయకులు ముందుకు వచ్చారు.

కొంత తాము ప్రజలకు అందుబాటులో ఉన్నాం.. అనుకున్నవారు మాత్రమే రంగంలోకి దిగారు. మిగిలినవారు ఇంకా బయటకు రాలేదు. ఇక ఇప్పటికే వచ్చిన వారు.. చాలా వరకు ప్రజలకుఅందుబాటులో ఉన్నవారే.

ఏదో ఒక రూపంలో ప్రజలకు కనిపించిన వారే. ఉదాహరణకు మంత్రి రోజాను తీసుకుంటే.. ఆమె నగరి నియోజకవర్గంలో నెలకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పర్యటించి.. ఇక్కడ క్యాంటీన్‌లు నిర్వహించడం.. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి నిత్యావసరాలను చౌకగా అందించే స్టోర్ ను ఏర్పాటు చేయడం వంటివి చేశారు. అయితే.. అలాంటి మంత్రికే.. గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి సెగతగిలింది. దీంతో ఇతర నాయకులు అంటే.. ప్రజలకు దూరంగా నాయకులు ఆత్మన్యూనతతో బాధపడుతున్నారు.

``ప్రజలు అభివృద్ధి అంటారు. రోడ్లేయలేదని.. అంటారు. ఏం చెప్పాలి. ఏం చెప్పినా తంటానే!`` అని కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అంటే.. ప్రజలు కోరుకున్నదానికి భిన్నంగా .. ఇక్కడ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమైంది.

దీంతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు వారు సంకోచిస్తున్నారు. మరోవైపు.. కొన్ని వర్గాలకు చెందిన వైసీపీ నాయకులు ఏదో ఒకరకంగా.. సంపాయించుకున్నా.. చాలా మంది నాయకులు సంపాదనకు దూరంగా ఉండిపోయారు. ఇలాంటివారు కూడా ఖర్చులకు వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో నాయకులు బయటకు రావడం లేదని అంటున్నారు.