Begin typing your search above and press return to search.

'బండి' అడ్డాలో అసమ్మతుల రహస్య భేటీ.. ఆ అదృశ్య శక్తి ఎవరు?

By:  Tupaki Desk   |   16 Jan 2022 4:33 AM GMT
బండి అడ్డాలో అసమ్మతుల రహస్య భేటీ.. ఆ అదృశ్య శక్తి ఎవరు?
X
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అంచనాలకు మించి మంచి మెజార్టీతో ఈటల రాజేందర్ విజయం సాధించటం.. అందరి చూపు ఆయన మీదకు మళ్లటం.. ఆయనో హాట్ టాపిక్ మారటం తెలిసిందే. అలాంటి వేళ.. ఈటల గురించి మాట్లాడుకోవటం మానేసేలా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారు ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదన్న అంశాన్ని టేకప్ చేయటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికి తెలిసిందే. ఈ హడావుడిలో ఈటల విజయాన్ని.. ఆయన పడిన శ్రమను.. అధికార పార్టీ ఫెయిల్యూర్ గురించి చర్చించుకోకుండా చేయటంతో గులాబీ బాస్ సక్సెస అయిన తీరును కొందరు ప్రస్తావిస్తుంటారు.

కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందనటానికి ఈ ఉదంతం ఒక చిన్న ఉదాహరణగా చెబుతుంటారు. తాజాగా.. తమపైనా.. తమ సర్కారుపైనా అదే పనిగా పడిపోయే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేసేలా సరికొత్త ప్లానింగ్ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి.. ఒక నాయకుడికి ఇమేజ్ పెరిగే వేళలో.. మిగిలిన వారు గమ్మున ఉంటారు. మనసులో కాసింత అసంత్రప్తి ఉన్నా మాట్లాడే ధైర్యం చేయరు. అందునా.. బీజేపీలాంటి పార్టీలో అసమ్మతి ఎంత ఉన్నా.. నాలుగు గోడల మధ్యే తప్పించి.. బయటపడటం దాదాపుగా ఉండదు.

అలాంటి పార్టీలో.. తాజాగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా..ఆయన తీరును తప్పు పడుతూ.. ఆయన సొంత అడ్డా అయిన కరీంనగర్ లో ఒక రహస్య భేటీ జరిగిన వైనం కలకలంగా మారింది.ఈ భేటీకి సంబంధించిన లీకు ఎలా బయటకు వచ్చింది? అన్నది ప్రశ్నగా మారింది. పార్టీలో మొదట్నించి ఉండి.. కష్టపడుతున్న వారికి గుర్తింపు లేదని.. కొత్త వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆరోపిస్తూ.. ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన పార్టీ నాయకత్వం.. విషయాన్ని అధినాయకత్వానికి నివేదిక రూపంలో అందించినట్లు చెబుతున్నారు. బీజేపీ వర్గాల వాదన ప్రకారం.. ఈ అసమ్మతి మీటింగ్ మొత్తం బండి ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి.. ఆయనకు సొంత పార్టీలోనే పొసగదని.. అలాంటి ఆయన అధికారపార్టీని విమర్శలు చేయటం ఏమిటన్న ప్రశ్నను తీసుకొచ్చేలా చేసే కుట్ర ఏదో ఒకటి జరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటికిమించి.. ఇటీవల ప్రభుత్వ తీరునుప్రశ్నిస్తూ.. నిరసన చేపట్టటం..ఆ సందర్భంగా జైలుకు వెళ్లటంతో బండి ఇమేజ్ అమాంతంగా పెరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయనతో ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తెలిసిందే. ఇలాంటి వేళలో బండి ఇమేజ్ ను దెబ్బ తీసేలా జరిగినట్లుగాచెబుతున్న రహస్య భేటీ వెనుక.. అదృశ్య శక్తి ఒకటి ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఆరా తీయటంలో కమలనాథులు బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. తమను దెబ్బ తీయటానికి తమ వారినే తమ మీద ప్రయోగించిన లెక్క తేలుస్తామని బండి వర్గీయులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.