Begin typing your search above and press return to search.

ఇంతకాలం మనం చదువుకున్నదంతా తప్పేనా? కొత్త పరిశోధన తేల్చిన వాస్తవాలు..!

By:  Tupaki Desk   |   5 March 2021 6:30 AM GMT
ఇంతకాలం మనం చదువుకున్నదంతా తప్పేనా?  కొత్త పరిశోధన తేల్చిన వాస్తవాలు..!
X
సైన్స్​ అనేది ఓ అంతులేని సబ్జెక్ట్​. రోజుకో పరిశోధన జరుగుతుంది. ఇవాళ మనం శాస్త్రీయంగా నిజమని నమ్మింది.. రేపు అబద్ధం కావచ్చు. భూగర్భం గురించి తాజాగా జరిపిన పరిశోధనలో అనేక కొత్త విషయాలు బయటపడ్డాయి. గతంలో భూమిలో కేవలం 4 పొరలు ఉన్నాయని అందరం చదువుకున్నాం. అయితే తాజాగా జరిపిన పరిశోధనలో మరో పొర ఉందని తేలింది. దీంతో ఇక నుంచి పాఠ్యపుస్తకాలను మార్చాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదివరకు మనకు పాఠ్యపుస్తకాల్లో భూ అంతర నిర్మాణంలో 4 పొరలు మాత్రమే ఉన్నాయని మనం చదువుకున్నాం.. అవి. ఏమిటంటే భూపటలము (crust), భూప్రావారము (mantle), బాహ్యకేంద్ర మండలం (outer core), అంతర కేంద్ర మండలం (inner core). అయితే ఇప్పుడు వీటితోపాటు మరో కొత్త పొర కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే అంతర అత్యంత కేంద్ర మండలం (inner most core).

భూ ప్రావారము అంటే ఏమిటి?

భూ పటలానికి .. బాహ్య కేంద్రానికి ఓ రాతిలా ఉండే పొరనే భూ ప్రావారం అంటారు. ఇది భూమి బరువులో 67 శాతం ఉంటుంది. భూమి సాంద్రతలో 85శాతం ఉంటుంది. బాహ్య కేంద్ర మండలం ద్రవరూపంలో ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇనుము, నికెల్​ లోహాలు ఉంటాయి. దీన్ని భూమి అయస్కాంత క్షేత్రానికి మూలంగా చెబుతుంటారు. ఇక అంతర కేంద్ర మండలము.. భూమికి కేంద్ర బిందువు లాంటిది. ఘనరూపంలో బంతి మాదిరిగా ఉంటుంది. ఇందులో అంతరంగా మరో పొర ఉందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ANU) శాస్త్రవేత్తల బృందం తేల్చేసింది. అదే అంతర అత్యంత కేంద్ర మండలం.

ఇన్నర్ కోర్ లో మరొక కోర్ దాగి ఉందని, అచ్చం రష్యన్ బొమ్మలాగే ఉందని అంటున్నారు. అయితే ఇంతవరకు ఈ నాలుగు పొరలు మాత్రమే ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతూ ఉండేవారు. పాఠ్యపుస్తకాల్లో కూడా అదే విషయం ఉండేది.తాజాగా ఇప్పుడు అంతర అత్యంత కేంద్ర మండలం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందని వాళ్లు అంటున్నారు. ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ మేరకు మార్పులు చేయబోతున్నారు.