Begin typing your search above and press return to search.

ఏపీలో ఆగస్టు 3 స్కూల్స్ ప్రారంభం..ఆరునెలల బోధన, 30% సిలబస్ కట్!

By:  Tupaki Desk   |   2 July 2020 8:10 AM GMT
ఏపీలో ఆగస్టు 3 స్కూల్స్ ప్రారంభం..ఆరునెలల బోధన, 30% సిలబస్ కట్!
X
ఈ వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంలో విద్యార్ధులను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు.దీనితో ఆన్ లైన్ విద్యా బోధనకే ప్రైవేటు స్కూళ్లు కూడా మొగ్గు చూపుతున్నాయి. ఈ తరుణంలో ఏపీలోనూ ప్రభుత్వం ఇదే తరహాలో ఆగస్టు 3 నుంచి ఆన్ లైన్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని చూస్తుంది. దూరదర్శన్ ద్వారా పాఠాలను విద్యార్ధులు ఇంటివద్దనే ఉంటూ నేర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ అకాడమిక్ ఇయర్ ఆలస్యం కావడంతో ఇక ఆన్ లైన్ వైపు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో, దాంతో సంబంధం లేకుండా ఇళ్లలోనే ఉంటూ విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా చదువుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠ్యాంశాల బోధనతో పాటు టీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరు లోపల ఈ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది మే నెల రెండో వారం వరకూ విద్యా సంవత్సరం కొనసాగుతుంది.

అలాగే .. దసరా, సంక్రాంతి సెలవులను కూడా పరిమితం చేస్తారు. మొత్తంగా 180 రోజుల పని దినాలు ఉంటాయి. మధ్యలో సెలవులను కూడా తగ్గిస్తారు. సిలబస్ లోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. విద్యార్దుల స్కూల్ టైమ్, పని దినాలు తగ్గడంతో ఆ మేరకు వారిపై ఒత్తిడి లేకుండా సిలబస్ లోనూ 30 శాతం కోత విధిస్తారు. ఏయే పాఠ్యాంశాలు ఉండాలో ఇప్పటికే అధికారులు, అధ్యాపకులు, నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం దూరదర్శన్ సప్తగిరి, మన టీవీ ఛానళ్లలో ప్రతీ రోజూ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయి. వాటిని విద్యార్ధులు ఫాలో కావాల్సి ఉంటుంది. మధ్యలో సందేహాలు వచ్చినప్పుడు టీచర్లను సంప్రదించేందుకు అన్ని ఆన్ లైన్ పద్దతులను అందుబాటులోకి తీసుకొస్తారు

ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్ధులకు బ్రిడ్జి కోర్సులను రోజుకు ఆరు గంటల పాటు ప్రసారం చేస్తున్నారు. వీటిని ఇకపైనా కొనసాగిస్తారు. ప్రతీ ఏటా మార్చి నెలలో నిర్వహించే పదో తరగతి పరీక్షలను ఈసారి ఏప్రిల్ కు మారుస్తున్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకూ పరీక్షలను మే నెలలో నిర్వహిస్తారు. మే రెండో వారం నుంచి వేసవి సెలవులను ప్రకటిస్తారు. జూన్ 10 నుంచి యథావిదిగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించనున్నారు. దీనికి అనుగుణంగా అకనమిక్ క్యాలెండర్ నూ, సిలబస్ నూ త్వరలో పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.