Begin typing your search above and press return to search.

సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేసేశారు.. పూజ‌ల పేరుతో ఒక‌రు.. ఉద్యోగాలంటూ మ‌రొక‌రు..!

By:  Tupaki Desk   |   5 March 2021 12:30 PM GMT
సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేసేశారు.. పూజ‌ల పేరుతో ఒక‌రు.. ఉద్యోగాలంటూ మ‌రొక‌రు..!
X
''ఓం శాంతి.. మ‌న‌శ్శాంతి.. విజ‌య‌శాంతి.. డిస్కోశాంతి..'' అంటూ ఒకరు భూమిలో బంగారం పుట్టించాడు! ''జింకులో కావాల్నా? బంకులో కావాల్నా? ఇంజన్లో కావాల్నా..'' అంటూ మరొకరు నకిలీ ఉద్యోగ పత్రాలు చేతిలో పెట్టారు! నెత్తిన గుడ్డ‌వేసుకున్న బాధితులు.. 'పోయిరావ‌లె పోలిస్టేష‌నుకు' అని ఖాకీలను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన రక్షభటులు 'వేట' మొదలు పెట్టి.. ఫైనల్ గా దొంగలకు సంకెళ్లేశారు. అయితే.. అసలు బాధితులు ఎలా మోసపోయారన్నదే ఇక్కడ అసలైన ట్విస్టు.

సీన్‌ 1ః హైదరాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని మీర్జాల మండి ప్రాంతంలో అబ్బాస్ అలీ సాజిద్ అనే వ్య‌క్తి నివాసం ఉంది. వాళ్ల అమ్మ‌కు రోజూ క‌ల వ‌స్తోంద‌ట‌. వాళ్ల ఇంట్లో బంగారం ఉంద‌నేది ఆ క‌ల సారాంశం. కానీ.. ఎక్క‌డ ఉందో మాత్రం చెప్ప‌ట్లేద‌ట ఆ క‌ల‌. దీంతో.. ఎలాగైనా తన‌ క‌ల నెర‌వేర్చుకోవాల‌ని డిసైడ్ అయ్యిందామె. విష‌యాన్ని కొడుకు సాజిద్ కు చెప్పింది. మ‌న క‌ల‌ను నిజం చేసే కెపాసిటీ మంత్ర‌గాడికి మాత్ర‌మే ఉంద‌ని ఫైన‌ల్ చేశారు. వ‌న్ ఫైన్ డే.. ఓల్డ్ మల్లేప‌ల్లిలో ఉండే మంత్రాల మాస్ట‌ర్ ద‌స్త‌గిరి అహ్మ‌ద్ ను మీట‌య్యారు. మొత్తం వినేసి.. '' మీ కల అద్భుతం.. మీ ఇంట్లో బంగారం ఉంది'' అని చెప్పేశాడు. దాన్ని బయటకు తీయగల కెపాసిటీ తనకు మాత్రమే ఉందని అన్నాడు.

అయితే.. ఆ ప‌నిచేయాలంటే కండీష‌న్స్ అప్లై అవుతాయ‌న్నాడు. కుడి చేత్తో బంగారం తీయాలంటే.. ఎడ‌మ చేతిలో ల‌క్ష్మిని పెట్టాల‌న్నాడు. అప్పుడే బ్యాలెన్స్ టాలీ అవుద్ద‌న్నాడు. ఎంత అంటే.. సింపుల్ గా రూ.3 ల‌క్ష‌లు అన్నాడు. బంగారంతో త‌న‌కు వ‌చ్చేదాంతో పోలిస్తే.. పోయెదెంత అని దూకుడులో బ్ర‌హ్మానందం మాదిరిగా లెక్కేసుకున్న సాజిద్ ఫ్యామిలీ.. డీల్ ఒకే అన్న‌ది. వెంట‌నే త‌న అనుచ‌రుల‌ను రంగంలోకి దించాడు ద‌స్త‌గిరి.

ఓ రోజు రాత్రి వాళ్లింటికెళ్లాడు. పూజ‌లతో హంగామా చేశాడు. ఇంట్లో ఐదు చోట్ల చిన్న‌పాటి గుంత‌లు త‌వ్వించాడు. అందులో మంత్రించిన వ‌స్తువులు పెట్టి పూడ్పించాడు. చాలా సేప‌టి త‌ర్వాత ఆ మూట‌ల‌ను తీయించాడు. ఓ గుంత‌లో నిజంగానే బంగారం బ‌య‌ట‌ప‌డింది. సామిరంగా.. ఆ కుటుంబం ఆనందానికి హ‌ద్దేలేదు. ఇంట్లోంచే చంద్ర‌మండలానికి పోయొచ్చారు. ఆనందంగా మూట‌విప్పి చూడ‌బోయారు. వెంట‌నే.. 'స్టాప్‌' అంటూ అరిచాడు మాంత్రికుడు దస్తగిరి. నేను చెప్పకుండా ముట్టుకున్నారంటే.. బంగారం మొత్తం సర్వనాశనం అవుద్దని హెచ్చరించారు. ఆ మూటను అలాగే ఉంచండి.. నేను మళ్లీ వస్తానని చెప్పి పోయాడు.

కానీ.. ఎంతకూ రావట్లేదు. ఈ లోగా వాళ్లు ఉండబట్టలేక మూటవిప్పారు. బంగారు బిస్కెట్లు తళతళా మెరుస్తున్నాయి. అదిచూసి ఉప్పొంగిపోయారు. ఇక మనం కుబేరులం అనుకున్నారు. కానీ.. పరీక్షగా చూస్తే.. అది నకిలీ బంగారం అని తేలిపోయింది. ఇదేంటని వెళ్లి అడిగితే.. నా పర్మిషన్ లేకుండా ముట్టుకున్నందుకు దేవత ఆగ్రహించింది, మీ బంగారాన్ని నకిలీగా మార్చింది అన్నాడు మాంత్రికుడు. దీంతో.. ఏం చేయాలో అర్థంగాక, దస్తగిరిని ఏమీ అనలేక ఇంటికి వెళ్లారు.

వాడు మనల్ని మోసం చేశాడు కదా.. మనం మరొకల్ని మోసం చేద్దామని ప్లాన్ వేసింది సాజిద్ ఫ్యామిలీ. తమ బంధువులలోని బకరాలను వెతికి పట్టారు. బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు. హబ్బ.. ఈజీగా వస్తోందని వారు కూడా కొనేశారు. ఆ తర్వాత గానీ వారికి విషయం తెలియలేదు. దీంతో పోలీసు స్టేషన్ కు చేరింది యవ్వారం. ముందుగా మోసపోయిన సాజిద్.. తాను మరొకరిని మోసం చేసినందుకు నేరస్థుడయ్యాడు.

సీన్ 2ః ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన‌గానే ముందూ వెన‌కా చూసుకోకుండా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు చెల్లించే వారికి కొద‌వ‌లేదు. వీదికి ప‌ది మంది దొరుకుతారు. ఇలాంటి వాళ్ల‌ను మోసం చేయ‌డానికి నిత్యం తిరుగుతూనే ఉంటారు కేటుగాళ్లు. అలాంటి బ్యాచ్ లో ఒక‌దాన్నిమూసేశారు పోలీసులు.

సైబ‌రాబాద్ కు చెందిన ఓ బాధితుడు, అత‌ని స్నేహితులు ఫేస్ బుక్ లో ఓ పోస్టు చూశారు. రైల్వే ఉద్యోగం ఇప్పించ‌బ‌డును, మ‌మ్మ‌ల్ని క‌ల‌వండ‌ని కాంటాక్ట్ నంబ‌ర్ కూడా ఉంది అందులో. వెంట‌నే సంప్ర‌దించారు. మాజిద్ అలియాస్ శ్రీనివాస్‌, స‌ర్వేష్ సాహు అలియాస్ అశోక్ వెంట‌నే లైన్లోకి వ‌చ్చారు. మీకు జింకులో కావాల్నా.. బంకులో కావాల్నా అంటూ అడిగారు. ఏదైనా ఫ‌ర్లేదు మాకు ఉద్యోగం కావాల‌న్నారు వీళ్లు. వెంట‌నే అభ‌య‌మిదే మిత్ర‌మా.. అంటూ భ‌రోసా ఇచ్చారు. కానీ.. ఆమ్యామ్యం గురించి తెలుసుకు క‌దా అన్నారు వాళ్లు.'ఎంత?' అని అడిగితే.. జ‌స్ట్ రూ.6 ల‌క్ష‌లు అన్నారు. ఓకే రైట్ అంటూ డీల్ సెట్ చేసుకున్నారు.

సెకండ్ ఫేజ్ లో ఢిల్లీ పిలిచారు. కోచింగ్ కూడా ఇచ్చారు. ఆ త‌ర్వాత ప‌లు ద‌శ‌ల్లో రూ.6 ల‌క్ష‌లు తీసుకున్నారు. శిక్ష‌ణ పూర్త‌యింద‌ని చెప్పి, ఐడీ కార్డుల‌తోపాటు ఆఫ‌ర్ లెట‌ర్స్ కూడా ఇచ్చేశారు. ఇక ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయ‌డ‌మే అనుకున్నారు వీళ్లు. అవి ప‌ట్టుకొని రైల్వే అధికారుల వ‌ద్ద‌కు వెళ్తే.. ''బాబూ ఇవి న‌కిలీవ‌మ్మా.. మీరు మోస‌పోయారు'' అని తాపీగా చెప్పారు అధికారులు. ఇంకేముందీ..? మోసపోయిన తర్వాత పోవాల్సింది పోలీస్ స్టేషన్ కే కదా! వెళ్లారు.. చెప్పారు. మ‌ళ్లీ రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టేసుకున్నారు. యూపీ, ఢిల్లీ, విజ‌య‌వాడ‌కు చెందిన అంత‌ర్ రాష్ట్ర ముఠాకు చెందిన న‌లుగురిలో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. ఈజీ మ‌నీకోసం కొంద‌రు సినిమా సీన్లు రీ-క‌న్ స్ట్ర‌క్ష‌న్ చేస్తూ మోసాల‌కు పాల్ప‌డుతుంటే.. అదే ఈజీ మ‌నీకోసం జ‌నాలు కూడా వాళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీనివ‌ల్ల‌ మోసాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ రెండు ఘ‌ట‌న‌ల ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు.