Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా ఇంటివద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్

By:  Tupaki Desk   |   15 Sep 2021 3:41 AM GMT
వైఎస్ వివేకా ఇంటివద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్
X
ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తు అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు, విచారణ సాగిస్తున్నారు. కర్నాటక నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా సోదాలు చేస్తోంది.

ఈ హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మంగళవారం పులివెందులలోని వివేకా ఇంటివద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజున నిందితులు ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? ఎలా బయటకు వెళ్లారన్న దానిపై రీకన్ స్ట్రక్షన్ చేశారు.

వైఎస్ వివేకా ఇంటికి నిందితులు బైక్ పై రావడం.. గేటు తీసి ఇంట్లోకి వెళ్లడం.. హత్య జరిగిన విధానం, ఎవరెవరు ఎలా వచ్చారు? ఎప్పుడెప్పుడు వచ్చారు? ఎలా హత్య చేశారు? ఆ తర్వాత ఎలా వెళ్లారన్న దానిపై ఆ వ్యక్తుల ద్వారా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తూ వీడియో తీసుకున్నారు.

హత్య చేసిన అనంతరం ఆయుధాలను పట్టణంలోని రోటరీ పురం వద్ద ఉన్న వంకలో వేసినట్టుగా అక్కడకు కూడా వెళ్లి రీకన్ స్ట్రక్షన్ చేశారు.

రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు తాజాగా ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. సునీల్ ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ సమాచారంతో వివేకా హత్య కేసు కొలిక్కి వస్తోందని సీబీఐ భావిస్తోంది.

వైఎస్ వివేకా హత్య వెనుక ఎవరెవరున్నారు. వాడిన ఆయుధాలేంటి? ఇలా పలు అంశాలపై సునీల్ యాదవ్ ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను పులివెందులలోని పలు చోట్లకు తిప్పుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును మలుపుతిప్పే ఆధారాలు దొరికినట్టుగా తెలుస్తోంది.తాజాగా సీన్ రీకన్ స్ట్రక్షన్ తో కేసు కీలక మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది.