Begin typing your search above and press return to search.

సత్య నాదెళ్ల సమర్పించు... అమెరికా టి20 లీగ్

By:  Tupaki Desk   |   21 May 2022 2:30 PM GMT
సత్య నాదెళ్ల సమర్పించు... అమెరికా టి20 లీగ్
X
ప్రపంచానికే పెద్దన్న.. ఆర్థికంగా అమేయ శక్తి.. అమెరికా. విస్తీర్ణపరంగా చూస్తే చాలా పెద్ద దేశం. జనాభా పరంగా లెక్కించినా పెద్ద దేశమే.కానీ, ఎందుకనో ఇన్నాళ్లూ ఆ దేశం క్రికెట్ లో ముందంజ వేయలేకపోయింది. బేస్ బాల్, బాస్కెట్ బాల్ ప్రభావంతో అగ్ర రాజ్యంలో క్రికెట్ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అడపాదడపా భారత్-వెస్టిండీస్ ల మధ్య టి20 సిరీస్ లకు వేదిక కావడమే తప్ప సీరియస్ క్రికెట్ కు వేదికైంది లేదు.

మనవాళ్లు ఎక్కించేశారు భయ్యా..?

చిన్న గల్లీలోనూ పది రూపాయలతో క్రికెట్ బెట్టింగ్ మ్యాచ్ ఆడేసే రకం మన భారతీయులు. వారికి పాకిస్థాన్, శ్రీలంక వంటి ఆసియా దేశాలవారూ తోడైతే.. ఇంకేముంది? ఆ దేశానికి క్రికెట్ ఫీవర్ ఎక్కేయకుండా ఉంటుందా? అమెరికాలో ఇప్పుడిదే జరుగుతోంది. భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల వారి సంఖ్య పెరుగుతోన్న కొద్దీ అమెరికాలో క్రికెట్ కల్చర్ పెరుగుతోంది. అందుకే అమెరికా కూడా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ జెంటిల్‌మ్యాన్ గేమ్ కోసం అమెరికా పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు దిగ్గజ కంపెనీల యజమానులు, సీఈఓలు సంయుక్తంగా ‘‘మేజర్లీగ్ క్రికెట్’’ ను ప్రారంభించారు. ఇందులో మన తెలుగు టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన పెట్టుబడిదారుడి కావడం విశేషం.

ఇదే తొలి ప్రొఫెషనల్‌ టీ20 లీగ్

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పెట్టుబడి పెడుతున్న మేజర్ లీగ్ క్రికెట్ తో అమెరికా వ్యాప్తంగా క్రికెట్‌కూ ఆదరణ పెరగడం ఖాయంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్‌ టీ20 లీగ్‌ అయిన మేజర్‌ లీగ్‌ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో పెట్టుబడికి ప్రవాస భారతీయ దిగ్గజాలు ఆసక్తిగా ఉన్నారు. సత్య నాదెళ్లతో పాటు అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌ కూడా నిధులు అందించారు. సిరీస్‌ A, A1 నిధుల సేకరణ పూర్తయింది. 120 మిలియన్‌ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలి రెండు సిరీస్‌ల కోసం 44 మిలియన్‌ డాలర్లను సేకరించినట్లు వెల్లడించింది. మిగతా మొత్తం (76 మిలియన్‌ డాలర్లు) వచ్చే ఏడాదిలోపు ఫండ్‌రైజింగ్‌ ద్వారా సేకరిస్తామన్నారు.

సత్య నాదెళ్లకు లీడర్ షిప్ నేర్పిందే క్రికెట్

హైదరాబాద్ లో చదువుకునే సమయంలో సత్య నాదెళ్ల క్రికెట్ బాగా ఆడేవారు. ఇది తనకు ప్రొఫెషనల్ గా ఎంతో ఉపయోగపడిందని సత్య చెబుతారు. స్కూల్ స్థాయిలో అందరితో కలిసి ఆడడంతో.. క్రికెట్ తనకు లీడర్ షిప్ క్వాలిటీస్ నేర్పిందని పొగుడుతుందటారు. ఇదే తర్వాత తనకు జాబ్ లోనూ టీంను నడిపించడం ఎలాగనేది నేర్పిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


నిధుల సేకరణలో సత్య నాదెళ్లదే కీలక పాత్ర

సిరీస్‌ A,సిరీస్‌ A1 రౌండ్‌ ఫండ్‌ రైజింగ్‌కు సత్య నాదెళ్ల నాయకత్వం వహించారు. ‘‘అమెరికాలో క్రికెట్‌ వ్యాప్తి కోసం, సదుపాయాల కల్పన కోసం ఫండ్‌ రైజింగ్‌ చేపట్టాం. దీని కోసం అత్యుత్తమ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్వెస్టర్స్‌ కమిటీ పని చేసింది. ప్రపంచ స్థాయి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెట్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇన్వెస్టర్‌ గ్రూప్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలను
నడిపించే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలో అమెరికాలో తొలి టీ20 లీగ్‌ను విజయవంతం చేస్తాం. అలానే అంతర్జాతీయ క్రికెట్‌ ఈవెంట్లను ఇక్కడ నిర్వహించేలా ప్రయత్నిస్తాం’’ అని మేజర్‌ లీగ్‌ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు.

మైదానాలు, శిక్షణ కేంద్రాలు

అమెరికాలాంటి పెద్ద దేశంలో మైదానాల ఏర్పాటు చాలా సులువు. అందులోనూ మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న దేశం కావడంతో మరింత తేలిక. ఫండ్‌ రైజ్‌ ద్వారా వచ్చే 120 మిలియన్ డాలర్ల (రూ.9,32,30,10,000)ను క్రికెట్ మైదానాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో అమెరికా నుంచి స్టార్‌ క్రికెటర్లు వచ్చేలా చూడనున్నారు.

వచ్చే ఏడాది టీ20 లీగ్‌

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో అమెరికా సభ్యురాలు. దేశంలో టీ20 క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (mlc)ని పార్టనర్‌గా ఎంపిక చేసుకుంది. యూఎస్‌ఏ పురుషుల, మహిళల జట్లకు ఎంఎల్‌సీ మద్దతుగా నిలవనుంది. 2024లో విండీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో కొన్ని మ్యాచ్ లకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో అమెరికాలో టీ20 క్రికెట్‌ వృద్ధి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సత్య నాదెళ్ల, శంతను నాయణ్‌ కాకుండా మాడ్రోనా వెంచర్‌ గ్రూప్‌ ఎండీ సోమ సోమసేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్‌, వెంకీ హరినారాయణ్‌, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్‌ ఛైర్మన్‌ జైతర్‌ సంజయ్‌ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్‌ తదితరులు ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు ఫండ్‌ అందించారు. ఏ ఇన్వెస్టర్‌ ఎంత ఇచ్చారనేది తెలియాల్సి ఉంది.

మిగతావారు ఎవరు?

సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో కాగా.. మాడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్, వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఛైర్మన్ జైతర్ సంజయ్ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్ తదితరులు ఉన్నారు.