Begin typing your search above and press return to search.

చిన్నమ్మ నిర్ణయం వెనుక అసలు కారణం అదేనా?

By:  Tupaki Desk   |   4 March 2021 5:30 AM GMT
చిన్నమ్మ నిర్ణయం వెనుక అసలు కారణం అదేనా?
X
ఆమె కానీ జైలు నుంచి బయటకు రావాలె కానీ అసలు రాజకీయం అప్పుడు కదా మొదలయ్యేది.. లాంటి మాటలు.. విశ్లేషణలు చాలానే వినిపించాయి. అందుకు తగ్గట్లే జైలు నుంచి విడుదల కావాల్సిన చిన్నమ్మ.. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి.. డిశ్చార్జి కంటే కూడా జైలుశిక్షను పూర్తి చేసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ముహుర్తం పెట్టుకొని మరీ చెన్నైకి ఆర్భాటంగా బయలుదేరిన చిన్నమ్మ.. తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించినోళ్లు.. తమ అంచనా నిజమైనందుకు సంతోషించటమే కాదు.. జరుగుతున్న పరిణామాల్ని తాము సరిగానే మదింపు చేస్తున్నట్లుగా ఫీలైనోళ్లు లేకపోలేదు.

చిన్నమ్మ అలియాస్ శశికళ ఎందుకీ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయాలతో తన సత్తా చాటుతానని.. అమ్మ కల కన్న రాజ్యాన్ని తీసుకొస్తానని ప్రతిన చేసిన ఆమె.. ఇప్పుడేమో ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకోవటానికి సిద్ధం కావటం పెనుసంచలనంగా మారింది. ఇంతకీ చిన్నమ్మఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది.

తొలుత మేనల్లుడు ఏర్పాటుచేసిన పార్టీలోకి ఆమె వెళతారన్న మాట వినిపించినా.. ఆమె మాత్రం అన్నాడీఎంకేలోనే కొనసాగాలన్న ఆసక్తిని ప్రదర్శించారు. తనను సస్పెండ్ చేసినప్పటికి.. పార్టీ జెండాను కారుకు పెట్టుకొని హల్ చల్ చేశారు. ఆమె ఎంట్రీతో అన్నాడీఎంకేలోని నేతలు పలువురు జంప్ అయిపోతారని భావించారు.కానీ.. అదేమీ జరగలేదు. మరోవైపు ఆమెనుపార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున వస్తుందని భావించారు. కానీ.. అలాంటి కూడా ఏమీ చోటుచేసుకోలేదు. ఈ పరిణామాలు చిన్నమ్మను నిరాశకు గురి చేశాయని చెబుతున్నారు.

చివరకు తనను పార్టీలో చేర్చుకోవాలన్న లాబీయింగ్ ను బీజేపీ అధినాయకత్వం నుంచి కూడా ఆమె చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటివేళలోనే చిన్నమ్మ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు.రాజకీయాలకు గుడ్ బై చెబుతూ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె ప్రకటన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పరాజయం తప్పదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటివేళ.. ఓటమిలో తన పాత్ర లేకుండా చేసుకోవటం కోసమే పక్కకు తప్పుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఒక దెబ్బకురెండు పిట్టలన్నట్లుగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించి.. ఎన్నికలు అయ్యాక ఘోర పరాజయమైన వేళలో.. పార్టీలోకి నేతలే తీసుకొస్తారని.. ఆ టైంలో అయితే పార్టీని చేజిక్కించుకోవటం తేలికగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రస్తుతానికి అస్త్రసన్యాసం ప్రకటన ఉందంటున్నారు. ఓటమి తర్వాత తాను లేకపోవటం వల్లే ఓటమి చెందినట్లుగా చెప్పుకునే వీలుందని అంటున్నారు. అలా అయితే.. దూరమైన వారంతా దగ్గరకు వస్తారని భావిస్తున్నారు.భవిష్యత్తు ప్రయోజనాలు లెక్కలోకి తీసుకొని.. తాజాగా తగ్గి ఉండాలని నిర్ణయించినుకున్నట్లు చెబుతున్నారు. చిన్నమ్మ నిర్ణయంతో మేనల్లుడు దినకరన్ ఏర్పాటుచేసిన పార్టీ పుంజుకునే వీలుందంటున్నారు. ఏమైనా ఈసారికి డీఎంకేనే అధికారంలోకి రావటానికి అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.