Begin typing your search above and press return to search.

శాంసన్ తెచ్చిన తంటా... అతడి గొప్పతనంపై ఎంపీల వాదులాట

By:  Tupaki Desk   |   28 Sep 2020 3:00 PM GMT
శాంసన్ తెచ్చిన తంటా... అతడి గొప్పతనంపై ఎంపీల వాదులాట
X
సంజూ శాంసన్.. పేరు ఇప్పుడు దేశమంతా మారు మోగుతోంది. రాజస్థాన్ కు వరుసగా రెండు విజయాలు ఇవ్వడంలో అతడు చేసిన బ్యాటింగ్ విన్యాసాల గురించే అంతా చర్చిస్తున్నారు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ 74 (32 బంతుల్లో; 1x4, 9x6) పరుగులు బాదాడు. స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 231.25. ఇక ఆదివారం షార్జాలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచులో విధ్వంసమే సృష్టించాడు. 42 బంతుల్లో 202.38 స్ట్రైక్‌రేట్‌తో 7 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 85 పరుగులు చేశాడు. 224 పరుగుల రికార్డ్ స్థాయి లక్ష్య చేధనలో ఏ మాత్రం బెదరకుండా అద్భుతంగా పోరాడాడు. రెండుసార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. దీంతో అతడిని అందరూ అభినందిస్తున్నారు. అతడిని పొగిడే క్రమంలో ఇద్దరు ఎంపీల మధ్య వాదులాట లాంటి ట్విట్టర్ పోరు జరిగింది.

సంజూ ఆట తీరుపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అభినందించారు. భారత క్రికెట్లో అతడు తర్వాతి ఎంఎస్ ధోనీ అవుతాడని చెప్పాడు. సంజూకి ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పానని ట్వీట్‌ చేశారు. ' దశాబ్దకాలంగా సంజు శాంసన్‌ నాకు తెలుసు. ధోనీ తర్వాత నువ్వేనని అతడికి 14 ఏళ్లు ఉన్నప్పుడే చెప్పా..ఇప్పుడు ఆ రోజులొచ్చే సమయం వచ్చింది ' అంటూ శశిథరూర్‌ ట్వీట్లో పేర్కొన్నారు. శశిథరూర్ ట్వీట్ పై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ రుస రుస లాడాడు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ అభిప్రాయాన్ని అంగీకరించలేదు.

ఆ విషయమై ట్వీట్ చేస్తూ
'మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజూ శాంసన్‌కు లేదు. అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజూ శాంసన్‌గానే ఉండాలి' అని గంభీర్‌ ట్వీట్ చేశారు. ఎంఎస్ ధోనీ అంటే చాలు గంభీర్ భగ్గుమంటారు. అతడిని ఎప్పుడెప్పుడు విమర్శించుదామా అని కాచుకు కూర్చొని ఉంటాడని మరోసారి రుజువైంది. ఈ పొగడ్తల్లోనూ గొడవేంటి..అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్స్ కూడా గంభీర్ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయమై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మాత్రం గంభీర్ కే మద్దతు ఇస్తూ ట్వీట్ చేశారు. 'సంజూ శాంసన్‌.. ధోనీ వారసుడు కాదు. అతడు ఎప్పటికీ శాంసనే.. ఒకే ఒక్కడు. అతడిని ఎవరితో పోల్చొద్దు. సంజూకి సరైన అవకాశాలు ఇస్తే.. ప్రపంచకప్‌లను గెలిచేవాడు. కానీ అలా జరగలేదు. ఈ రెండు ఇన్నింగ్స్‌లోనే కాదు.. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడతాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొడతాడు.' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.