Begin typing your search above and press return to search.

పొట్టి ఫార్మాట్‌కు అతడు పనికిరాడు .. అశ్విన్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   15 Oct 2021 5:21 AM GMT
పొట్టి ఫార్మాట్‌కు అతడు పనికిరాడు ..  అశ్విన్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు !
X
టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ టీ20 ఫార్మాట్ పనికిరాడని మాజీ క్రికెటర్ సంజయ్ మ్రంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌ లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌ లో అశ్విన్‌ ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ ను అసలు జట్టులోకే తీసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌ పీఎన్ క్రిక్ ఇన్‌ ఫో టైమ్ ఔట్ లైవ్ షోలో మాట్లాడుతూ అశ్విన్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌ ను అనవసరంగా తీసుకున్నారు. అశ్విన్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశాం. టీ20 బౌలర్‌ గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదు. టీ20 ఫార్మాట్‌ లో అశ్విన్‌ బౌలింగ్‌ శైలి మారాలనుకుంటే అది జరిగేది కాదు. గత ఐదారేళ్లుగా ఐపీఎల్‌ లో అతను ప్రాతినిథ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడు. టర్నింగ్‌ వికెట్లపై నేనైతే వికెట్‌ టేకింగ్‌ బౌలర్ల అయిన వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, యుజ్వేంద్ర చహల్‌‌ లను ఎంచుకుంటాను. టెస్ట్‌ ఫార్మాట్‌ లో అశ్విన్‌‌ కు తిరుగు లేదు. సుదీర్ఘ ఫార్మాట్‌ లో అతనో అద్భుతమైన బౌలర్.

కానీ టీ20 ఫార్మాట్‌ కు మాత్రం అతని బౌలింగ్ అస్సలు పనికిరాదు అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌ లో భాగంగా కోల్‌ కతా నైట్‌‌రైడర్స్‌ తో బుధవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ లో అశ్విన్ వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ బాదడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌ లో అశ్విన్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసాడు. యూఏఈ వంటి టర్నింగ్ ట్రాక్‌ లపై దారుణంగా విఫలమయ్యాడు.

ఐపీఎల్ 2021 టైటిల్ ఎవరికి దక్కనున్నదో మరి కొన్ని గంటల్లో తెలిసిపోనున్నది. లీగ్‌ లో 59 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌ కతా నైట్‌రైడర్స్ కప్ కోసం ఫైనల్‌ లో తలపడనున్నాయి. తుది పోరులో చెన్నై, కోల్‌కతాలు నీకా నాకా అన్నట్లుగా సిద్దం అవుతున్నాయి. ఈ రెండు జట్లు సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాయి. చెన్నై జట్టు మొదటి నుంచి అంచనాలకు మించి రాణించగా.. కోల్‌ కతా నైట్‌రైడర్స్ మాత్రం తొలి దశ కంటే యూఏఈలో జరిగిన రెండో దశలోనే అద్భుతంగా ఆడింది. చెన్నై లీగ్ దశలో 14 మ్యాచ్‌ లకు గాను 9 మ్యాచ్‌ లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పై విజయం సాధించి నేరుగా ఫైనల్స్ చేరుకున్నది. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్ 14 మ్యాచ్‌ లకు గాను ఏడింట విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును.. రెండో క్వాలిఫయర్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ను ఓడించి ఏడేళ్ల తర్వాత ఫైనల్ చేరుకున్నది. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌ కు చేరుకోవడం ఇది 9వ సారికాగా.. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ కు ఇది మూడో సారి.