Begin typing your search above and press return to search.

సుశాంత్‌ కేసుని సీబీఐకి అప్పగించడాన్ని తప్పు పట్టిన శివసేన ఎంపీ..!

By:  Tupaki Desk   |   9 Aug 2020 11:48 AM GMT
సుశాంత్‌ కేసుని సీబీఐకి అప్పగించడాన్ని తప్పు పట్టిన శివసేన ఎంపీ..!
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించిన సంగతి తెలిసిందే. సుశాంత్ సూసైడ్ కేసులో ముందుగా మహారాష్ట్ర పోలీసులు.. ఆ తర్వాత బీహార్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసుని సీబీఐ ఎంక్వరీకి ఇవ్వమని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తుండటంతో హై ప్రొఫైల్ కేసుగా భావించిన బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించమని కేంద్రాన్ని కోరింది. దీంతో ఈ కేసుని కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే విచారణ ప్రారంభించిన సీబీఐ.. బీహార్ పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నివేదిక ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసుని సీబీఐకి అప్పగించడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఓ వర్గం మీడియా సహాయంతో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కాగా, ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌ తోక్‌ అనే తన కాలమ్‌ లో రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒత్తిళ్లు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు సంజయ్ రౌత్. సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించడం ముంబై పోలీసులను అవమానించినట్లేనని.. సీబీఐ సెంట్రల్ ఏజెన్సీ అయినప్పటికీ అది నిష్పాక్షికంగా దర్యాప్తు జరపదని అనేకసార్లు నిరూపించబడిందని.. సీబీఐని కేంద్ర ప్రభుత్వాలు ఎలా దుర్వినియోగం చేస్తుంటాయో శివసేన ఎంపీ వెల్లడించారు. ''దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయి. శారదా చిట్‌ ఫండ్ కేసులో జోక్యం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్‌ లో ప్రజలు ధర్నాలు చేశారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ - అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో ఉన్నప్పుడు సీబీఐపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. గోద్రా అల్లర్ల కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ఇప్పుడు సుశాంత్‌ కేసును కూడా సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తే తప్పేంటి? అని సంజయ్‌‌ ప్రశ్నించారు.