కోహ్లీ ర్యాంకులు కాదు..కప్పులు కావాలి..

Thu Jan 27 2022 06:00:02 GMT+0530 (IST)

Sanjay Manjrekar Comments On Virat Kohli

ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్ మెన్ గా ఎదిగినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఒక్క ప్రపంచకప్ కూడా గెలవకపోవడం పెద్ద లోటు. విరాట్ కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక కారణం కూడా అదే. టీ20లకు అతడే గుడ్ బై చెప్పగా వన్డేలకు బీసీసీఐ తొలగించింది. వైరాగ్యంతో టెస్టుపగ్గాలు కూడా అతడు వదిలేశాడు.విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై బీసీసీఐకి ఫ్యాన్స్ నుంచి వస్తున్న విమర్శలకు ప్రముఖ విశ్లేషకుడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కౌంటర్ ఇచ్చారు. బీసీసీఐకి మద్దతు తెలిపాడు.

విరాట్ ను తొలగించి రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ నిర్ణయం సరైందేనని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఐసీసీ ట్రోఫీని నెగ్గలేకపోవడమే కోహ్లీపై వేటుకు కారణమని పేర్కొన్నాడు.

అభిమానులు ప్రపంచకప్ లు గెలవాలని కోరుతున్నారని.. అందుకే కోహ్లీని తప్పించి రోహిత్ కు బాధ్యతలను బీసీసీఐ అప్పగించి ఉంటుందని విశ్లేషించాడు. వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై కోహ్లీ అసంతృప్తిగా ఉండడం సరైందేనా? అన్న ప్రశ్నకు మంజ్రేకర్ సమాధానం ఇచ్చారు.

‘అభిమానులు ప్రపంచకప్ వంటి ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ఇదేదో ర్యాంకులు సిరీస్ ల గురించి కాదు. అందుకే కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు’ అని మంజ్రేకర్ విశ్లేషించారు.

కోహ్లీ నేతృత్వంలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం దక్కించుకుంది. కానీ అతడి సారథ్యంలో ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా భారత్  గెలుచుకోలేకపోయింది. మంజ్రేకర్ అదే విషయాన్ని ప్రస్తావించి విమర్శించాడు.