Begin typing your search above and press return to search.

సెలబ్రిటీలను ఉతికి ఆరేసిన సానియా

By:  Tupaki Desk   |   5 April 2020 6:37 AM GMT
సెలబ్రిటీలను ఉతికి ఆరేసిన సానియా
X
తొందరపడి ఎదుటోళ్లను ఒక మాట అనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే తత్త్వం కొందరు ప్రముఖులకు ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అలాంటి ఆమెకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడుపడకపోవటమే కాదు.. తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినట్లుగా ఉంది. కరోనా వేళ.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో సినీ నటులు మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇళ్లకే పరిమితం కావటం తెలిసిందే.

రోటీన్ వర్క్ కు దూరంగా ఉండటం.. ఇంటి పట్టునే ఉండటంతో తమకు సంబంధించిన పలు వీడియోల్ని సెలబ్రిటీలు అదే పనిగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఆ వీడియోల్లో అత్యధికం తమ ఇమేజ్ ను పెంచుకునేలా.. తమను తాము కొత్తగా ఆవిష్కరించుకునేలా ఉన్నవే కావటం గమనార్హం. సామాన్యులు ఎప్పుడూ ఊహించని రీతిలో వాడిన పాత్రల్ని కడగటం.. ఇంటి పనులు చేయటం.. వంట చేయటం లాంటివే ఎక్కువ.

ఇలాంటి వాటిపైన సానియా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజాగా ఆమె ట్విట్టర్ లో ఘాటైన ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మన చుట్టూ ఉన్న ప్రజలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మందికి రోజుకు ఒక పూట తిండి దొరకటమే కష్టంగా ఉంది. ఇలాంటివేళ.. వంటలు.. రుచుల వీడియోల్ని పోస్టు చేయటమా? అన్న రీతిలో ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

సంక్షోభ సమయాల్లో ఇలాంటి వీడియోలు పోస్టు చేయటం ఏమిటన్న ఆమె మాటలు పలువురుసెలబ్రిటీలను సూటిగా తాకటం ఖాయం. మిగిలిన వారికి భిన్నంగా పెట్టిన పోస్టుతో సానియా ఒక్కసారిగా అందరి చూపు తన మీద పడేలా చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంతకూ కరోనా విషయంలో సానియా చేస్తున్నదేమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వచ్చింది.