ఒక్కోసారి వ్యక్తులు ఒక్కో విధంగా వ్యవహరిస్తుండటం మామూలే. కానీ సంస్ధలు కూడా అలాగే వ్యవహరించటం మాత్రం విచిత్రమనే చెప్పాలి. ఇపుడిదంతా ఎందుకంటే సీబీఐ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒక్కోసారి ఒక్కో విధమైన స్టాండు తీసుకుంటుండటమే ఆశ్చర్యంగా ఉంది. అదికూడా ఒకే రకమైన కేసు విచారణలో రెండు కోర్టుల్లో ఒక్కో విధంగా స్పందిస్తోంది. రెండు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ విచారణ సందర్భంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వాలనే పాయింట్ మీదే కావటం గమనార్హం.
ఇక విషయంలోకి వస్తే మొదటి సీబీఐ ప్రత్యేక కోర్టులో
జరిగిన విచారణను పరిశీలిద్దాం. సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి
జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ
ప్రత్యేక కోర్టులో పిటీషన్ వేశారు. కేసు విచారణ సందర్భంగా సాక్షులను
ప్రభావితం చేస్తున్నారనే పాయింట్ మీద న్యాయమూర్తి సీబీఐ వాదన వినిపించమని
అడిగారు. సాక్షులను ప్రభావితం చేయాలనే పాయింట్ మీద సీబీఐ ఎలాంటి వాదన
వినిపించకుండా జగన్ బెయిల్ రద్దు విషయాన్ని కోర్టు విచక్షణకే
వదిలిపెట్టేసింది.
అయితే ప్రత్యేక కోర్టు ఒకటికి రెండుసార్లు
అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గట్టిగా అడిగారు. దాంతో సీబీఐ అఫిడవిట్
దాఖలు చేసింది. అందులో జగన్ సాక్షులను ప్రభావితం చేసినట్లు తమకు ఎవరు
ఫిర్యాదులు చేయలేదని తమ దృష్టికి కూడా రాలేదని చెప్పింది. ఇదే సమయంలో
పిటీషన్ వేసిన రఘురామ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలను
చూపలేకపోయారు. దాంతో బెయిల్ రద్దు చేయాలన్న రఘురాజు పిటీషన్ను సీబీఐ
ప్రత్యేక కోర్టు కొట్టేసింది.
ఇక ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న
విచారణ విషయాన్ని చూద్దాం. కేసు విచారణ సందర్భంగా సాక్షులను ప్రభావితం చేసే
అవకాశం ఉంది కాబట్టి విచారణ సందర్భంగా జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలా ?
వద్దా ? అన్నది పాయింట్. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది
కాబట్టి విచారణ నుండి మినహాయింపు ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తోంది. దీనికి
వ్యతిరేకంగా జగన్ తరపున లాయర్ వాదనలు వినిపిస్తున్నారు.
ఇక్కడ
గమనించాల్సిన విషయం ఏమిటంటే కోర్టులు రెండు. మొదటిదేమో సీబీఐ ప్రత్యేక
కోర్టు. రెండోదేమో హైకోర్టు. పిటీషన్లు రెండు రకాలు. మొదటిదేమో జగన్ బెయిల్
రద్దు చేయాలని. ప్రస్తుత కేసేమో వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు. రెండు
కోర్టుల్లోను జగన్ తరపున లాయర్ వాదన ఒకటే. కానీ సీబీఐ వాదనలే భిన్నంగా
ఉన్నాయి. సీబీఐ ప్రత్యేక కోర్టులోనేమో సాక్షులను బెదిరించినట్లు తమ దగ్గర
ఎలాంటి సమాచారం లేదని తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పింది.
అదే
హైకోర్టుకు వచ్చేసరికి ఇదే సీబీఐ సాక్షులను జగన్ బెదిరించే
అవకాశాలున్నాయని వాదిస్తోంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలకు హైకోర్టులో
వినిపిస్తున్న వాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడా ఇక్కడా వాదనలు
వినిపించింది మళ్ళీ సీబీఐ లాయర్లే. రెండు కోర్టుల మధ్య వాదనల్లో సీబీఐ
వైఖరి ఎందుకు మారిపోయిందనేది అంతుపట్టడం లేదు. మరీ వ్యక్తుల్లాగ కోర్టు
కోర్టుకు పరస్పర విరుద్ధంగా ఒపీనియన్లు మార్చేసుకోవటం వల్ల జనాల్లో ఎలాంటి
ముద్రపడుతుందో సీబీఐకి అర్ధమవుతున్నట్లు లేదు.