Begin typing your search above and press return to search.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు సమత హత్యాచార నిందితులు!

By:  Tupaki Desk   |   16 Dec 2019 11:10 AM GMT
ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు సమత హత్యాచార నిందితులు!
X
గతనెల 24న కుమురం భీం జిల్లాలో హాత్యాచారానికి గురైన సమత కేసులో నిందితులకు జ్యూడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో నిందితులు షేక్‌ బాబు - మఖ్దూం - షాబొద్దీన్‌ లను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు తరలించారు. మరోవైపు నిందితుల తరఫున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్ని న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు ప్రభుత్వమే ఓ న్యాయవాదిని నియమించే అవకాశముంది.

ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ ను అసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం - హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో బాధితురాలి పేరును పోలీసులు ‘సమత’గా మార్చారు. నిందితులు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌ లో తెలిపారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీ ఎన్‌ ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.