కేసీఆర్ భూముల అమ్మకం.. కాంగ్రెస్ సంచలన తీర్మానం

Mon Jun 14 2021 17:00:01 GMT+0530 (IST)

Sale of KCR lands Congress sensational resolution

సీఎం కేసీఆర్ తెలంగాణలో అమ్మే భూములు ఎవరూ కొనొద్దని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటిని స్వాధీనం చేసుకుంటామని సీఎస్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు ఇస్తామని చెప్పారు.తెలంగాణలో ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు గత ప్రభుత్వాలు ఆస్తులుగా ఇచ్చిన ప్రభుత్వ భూములను కూడా అమ్మి రాష్ట్రాన్ని దివాళా తీయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. దీనిపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని.. ఆ తర్వాత అమ్మాలని తలపెట్టిన భూములను సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే అడ్డుకోవాలన్నారు.

ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఇక్కడి వనరులు మనవి.. ఆస్తులు మనివి.. ప్రజలకు ఉపయోగపడాలే తప్ప ఆస్తులు అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకోం అని భట్టి హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేస్తామన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిందని.. ఈ భారాన్ని భరించలేదని స్థితిలో ఉండగా.. మళ్లీ ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. అమ్మకానికి పెట్టిన భూములు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.